logo

మహా ప్రసాదం

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మల్లన్న లడ్డూలు సిద్ధం కానున్నాయి. ఈ ప్రసాదం అంటే భక్తులకు అమితమైన ప్రీతి.

Updated : 06 Feb 2023 04:35 IST

బ్రహ్మోత్సవాలకు 30 లక్షల లడ్డూల తయారీ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మల్లన్న లడ్డూలు సిద్ధం కానున్నాయి. ఈ ప్రసాదం అంటే భక్తులకు అమితమైన ప్రీతి. బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది తరలిరానుండడంతో అందుకు సరిపడా లడ్డూలు తయారుచేసేందుకు దేవస్థానం యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

శ్రీశైలం క్షేత్రంలో ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఇల కైలాసానికి తరలిరానున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకున్న తర్వాత మల్లన్న ప్రసాదాలు తీసుకునేందుకు మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో వారికి కావాల్సినన్ని లడ్డూలు అందించేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. మొత్తం 30 లక్షల లడ్డూలు సిద్ధం చేసేలా దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు శివదీక్ష భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుండడంతో రోజుకు లక్ష నుంచి లక్షన్నర లడ్డూల అమ్మకాలు సాగుతాయని అంచనా వేస్తున్నారు. 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రోజుకు 2 లక్షల నుంచి 5 లక్షల లడ్డూలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని పోటులో లడ్డూ తయారీకి కావాల్సిన పొయ్యిలు, వంట సామగ్రి సిద్ధం చేస్తున్నారు. తయారైన వాటిని లడ్డూ విక్రయశాల వద్ద నిల్వ చేస్తారు.

వినియోగించే సరకులు..

మరో ఐదు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూల తయారీకి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఒక్కో లడ్డూ 100 గ్రాముల బరువు ఉంటుంది. రూ.20 చొప్పున విక్రయిస్తారు. గత ఏడాది 27.50 లక్షల అమ్మకాలు జరిగాయి. లడ్డూల తయారీకి సంబంధించి శనగపిండి 84,000 కేజీలు వాడనున్నారు. చక్కెర 1,51,200 కేజీలు, జీడిపప్పు 5,500 కేజీలు, ద్రాక్ష 5,880 కేజీలు, యాలకులు 638.400 కేజీలు, పచ్చ కర్పూరం 100.800 కేజీలు, జాజికాయ 134.400 కేజీలు, నెయ్యి 53,760 కేజీలు వినియోగించనున్నారు.

వంద మంది సిబ్బంది

* ఆలయ ప్రాంగణంలోని పోటులో లడ్డూల తయారీకి 100 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ప్రత్యేక విధులకుగాను విజయవాడ నుంచి సిబ్బంది హాజరవుతారు. లడ్డూ విక్రయాలకు 15 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మకాలకు సంబంధించి 120 మంది సిబ్బంది పనిచేస్తారు.

* ఈ సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న మాట్లాడుతూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 30 లక్షల లడ్డూలు తయారుచేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు లడ్డూల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 15 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని