logo

సాగని వ్యాపారం.. దక్కని ఆదాయం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం ముందుకు సాగడం లేదు. అభివృద్ధి పడకేయటంతో పొలాలు, స్థలాలు కొనలేం.. అమ్మలేం అన్నట్లుగా మారింది.

Published : 06 Feb 2023 03:17 IST

లక్ష్య సాధనలో స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ తడబాటు

కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం ముందుకు సాగడం లేదు. అభివృద్ధి పడకేయటంతో పొలాలు, స్థలాలు కొనలేం.. అమ్మలేం అన్నట్లుగా మారింది. యజమానులు ధరలు తగ్గించి అమ్మలేకపోతుండగా.. ఆస్తులు కొనుగోలు చేస్తే వాటి ధర పెరుగుతుందో? లేదో? అన్న అనుమానంతో చాలామంది ఆసక్తి చూపడం లేదు. గతంలో అప్పులు చేసి ఆస్తులు కొనుగోలు చేసినవారు ఎంతో కొంత లాభపడగా ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అప్పులు చేసి స్థిరాస్తి వ్యాపారం చేసిన వారందరూ నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరడం లేదు. ఈ ప్రభావం ప్రభుత్వ ఖజానాపైనా పడుతోంది.

రెండు మినహా..

కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం సమకూరేది. 2022 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ఆదాయ వివరాలు పరిశీలిస్తే నంద్యాల, కోసిగి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మినహా మిగిలినవి ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. కర్నూలు, ఆదోని, ఓర్వకల్లు, ఇతర ముఖ్య కార్యాలయాలు 80 శాతం వరకు లక్ష్యాన్ని అధిగమించినప్పటికీ ఎప్పుడూ ఆదాయంలో ముందుండే కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అతికష్టం మీద 67 శాతానికి మాత్రమే చేరుకుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద రద్దీ తగ్గటం ఇందుకు నిదర్శనం. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఆదాయాలు పరిశీలిస్తే స్థిరాస్తి వ్యాపారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నంద్యాల జిల్లా ఆదాయం మెరుగు..

స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయాన్ని పరిశీలిస్తే కర్నూలు జిల్లా కంటే నంద్యాల జిల్లా ఆదాయం మెరుగ్గా ఉంది. 2022 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు కర్నూలు జిల్లా ఆదాయం లక్ష్యం రూ.294.68 కోట్లు కాగా.. రూ.231.21 కోట్లు (78.46 శాతం) మాత్రమే వచ్చింది. నంద్యాల జిల్లా ఆదాయ లక్ష్యం రూ.146.46 కోట్లు కాగా.. రూ.123.37 కోట్లు (84.24 శాతం) వచ్చింది. మొత్తంమీద ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదాయ లక్ష్యంలో 81.35 శాతానికి మాత్రమే చేరడం గమనార్హం. దీనిని పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయ లక్ష్యం సాధించటం కష్టసాధ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని