logo

చిత్తశుద్ధి ఉంటే సమస్యలు పరిష్కరించండి

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

Published : 06 Feb 2023 03:17 IST

ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు

జ్యోతి వెలిగిస్తున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. కర్నూలు నగరంలో ఏపీ ఐకాస అమరావతి (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి) రాష్ట్ర మూడో మహాసభను ఆదివారం నిర్వహించారు. ఒకటో తేదీ వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వేతనాలు, పింఛను కోసం ఎదురుచూపులు చూడక తప్పడం లేదన్నారు. కరోనా సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద నేటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. చిరు ఉద్యోగుల రేషన్‌ కార్డులు తొలగించారన్నారు. ఆర్థిక చెల్లింపుల విషయంలో ఉద్యోగుల పరిస్థితి హీనంగా ఉందన్నారు. దాచుకున్న సొమ్ము, పెట్టుకున్న బిల్లులూ పెండింగ్‌లో ఉండటంతో పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడం, సమయానికి ఆరోగ్య సంబంధమైన విషయాలనూ పక్కన పెట్టాల్సి వస్తోందని చెప్పారు. తాజా మాజీ ప్రధాన కార్యదర్శి వై.వి.రావు మాట్లాడుతూ మరోమారు ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలన్నారు. అసోసియేట్‌ ఛైర్మన్‌ ఫణి పేర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలు చెల్లించకపోవడం బాధాకరమని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ఐకాస సీనియర్‌ నాయకులు అల్‌ఫ్రెడ్‌ విచారం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి, మూడున్నరేళ్లయినా దాని ఊసేలేదని ఏపీసీపీఎస్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి మండిపడ్డారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై ఆ సంఘాల ప్రధాన కార్యదర్శులు కె.సుమన్‌, భానోజీ, మహిళా ఉద్యోగుల సమస్యలు, చైల్డ్‌ కేర్‌, ప్రసూతి సెలవులు తదితర సమస్యలపై ఐకాస అమరావతి మహిళా నాయకురాలు జి.జ్యోతి మాట్లాడారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్వరరావు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఆర్లయ్య తదితరులు ప్రసంగించారు. వివిధ సంఘాల నాయకులు ప్రసంగించారు.

* ఈ మహాసభలో ఏపీ ఐకాస అమరావతిలో మరో ఆరు సంఘాలు చేరాయి. ఈ సంఘాలు చేరికతో 100 సంఘాలు అయ్యాయని బొప్పరాజు చెప్పారు. ఈ సందర్భంగా కేకు కోసి సంబరాలు చేసుకున్నారు.

* సభలో తీసుకున్న నిర్ణయం మేరకు మేధావులైన ఏడుగురు సభ్యులతో సలహాదారులను ఏర్పాటు చేసినట్లు బొప్పరాజు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ ఐకాస అమరావతికి నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గాన్ని, 26 జిల్లాల నూతన అధ్యక్ష, కార్యదర్శులను మహాసభకు బొప్పరాజు   పరిచయం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని