logo

జీవితాలు మట్కాష్‌

మట్కా.. చీటీలు జీవితాలను లూటీ చేస్తున్నాయి. జూదానికి అలవాటు పడిన వారు అప్పులపాలవుతున్నారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిన కష్టంతో వచ్చిన ఆదాయాన్ని అందులో గుమ్మరిస్తున్నారు.

Updated : 06 Feb 2023 04:37 IST

ఉచ్చులో చిక్కుకుంటున్న కూలీలు, యువత
రూ.కోట్లలో వ్యాపారం
అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం

న్యూస్‌టుడే, ఆదోని నేరవార్తలు: మట్కా.. చీటీలు జీవితాలను లూటీ చేస్తున్నాయి. జూదానికి అలవాటు పడిన వారు అప్పులపాలవుతున్నారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిన కష్టంతో వచ్చిన ఆదాయాన్ని అందులో గుమ్మరిస్తున్నారు. ఈ ఆట మన రాష్ట్రంలో నిషేధం ఉన్నా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. మాట్కా ఆటను అదుపు చేయాల్సిన పోలీసు శాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఆదోని డివిజన్‌లో ఈ మట్కా నిర్వహణతో రోజూ రూ.కోట్లలో లావాదేవీలు కొనసాగుతున్నాయి.

సరిహద్దే స్థావరం

ఆదోని ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో జిల్లాలో మట్కా ప్రభావం అధికంగా ఉంది. మట్కా నిర్వాహకులు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, శిరుగుప, బళ్ళారి ప్రాంతాల్లో ఉంటూ ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని మట్కా కొనసాగిస్తున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆటకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సోమవారం నుంచి శనివారం వరకు కొనసాగే ఈ ఆటపై ప్రధానంగా దినసరి కూలీలు, యువకులు అధికంగా ఆకర్షితులవుతూ సంపాదనలో సగానికి పైగానే ఈ మహమ్మారి ఆటపై పెట్టి సొమ్ము పోగొట్టుకుంటున్నారు.

కానరాని కఠిన చర్యలు

మట్కా నిర్వహణను అరికట్టాల్సిన పోలీసు శాఖ ఇటీవల నిఘా వైఫల్యంతో మట్కా నిర్వహణ చాపకింద నీరులా కొనసాగుతోంది. ప్రధానంగా పట్టణంలోని మట్కార్‌గేరిలో ఆరు చోట్ల, శక్తిగుడి ప్రాంతంలో 2, వాల్మీకినగర్‌లో 2, చౌదరిబావి ప్రాంతంలో 2, మార్కెట్‌ యార్డు ప్రాంతంలో 2, కౌడల్‌పేటలో 4, కొత్త బస్టాండు ప్రాంతంలో ఒకచోట, చిన్నమార్కెట్‌, క్రాంతినగర్‌లో 3, కల్లుబావి, ఇందిరానగర్‌, హనుమాన్‌నగర్‌ ప్రాంతాల్లో రెండు చోట్ల మట్కా నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో లావాదేవీలు కొనసాగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ఇక్కడే కాకుండా ఆయా గ్రామాల్లోనూ మట్కా నిర్వాహకులు తమ ఏజెంట్లను నియమించుకొని మట్కా నిర్వహిస్తున్నారు. కొత్త అధికారులు వస్తే ఆయా స్టేషన్ల పరిధిలోని మట్కా బీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇస్తున్నారే తప్ప.. నియంత్రణపై దృష్టిసారించడం లేదు. మరికొందరు పోలీసు సిబ్బంది ప్రతి నెలా మట్కా బీటర్ల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

రూపాయికి రూ.80

మహారాష్ట్రాలోని ముంబయి నగరంలో ఈ మట్కా ఆట నిర్వాహిస్తారు. అక్కడి నుంచి కర్ణాటక.. తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించింది. బాంబే మిలన్‌, కల్యాణ్‌, కల్యాణ్‌ నైట్‌, మిలన్‌ నైట్‌ తదితర కంపెనీలకు సంబంధించి మట్కా నిర్వహిస్తారు. ఇందులో ఓపెన్‌ నెంబరు, క్లోజ్‌ నెంబర్లు రోజూ ప్రకటిస్తారు. ఓపెన్‌ లేక క్లోజ్‌ నెంబరుపై రూపాయి ఆడితే.. అదే నెంబరు వస్తే రూ.8 వస్తుంది. అదే ఓపెన్‌, క్లోజ్‌ రెండు నెంబర్లు కలిసి నెంబరుపై రూపాయి ఆడితే ఆ నెంబరు వస్తే రూ.80 వస్తోంది.  రోజు కూలీలు సుమారు రోజుకు రూ.300 సంపాదిస్తే ఇందులో రూ.50 నుంచి రూ.100 దాకా పెట్టి తమ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు.

నిర్వహణ ఇలా చేస్తూ..

మట్కా నిర్వాహకులపై పోలీసుల దృష్టి మరల్చేందుకు మట్కా బీటర్లు సామాజిక మాధ్యమాల ఆధారంగా కొనసాగిస్తున్నారు. నిర్వాహకులు మట్కా ఆడే వారి నుంచి ఫోన్‌ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. మరికొందరు ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలో మహిళల చేత డబ్బులు తీసుకొని మట్కా చీటీలు రాసుకుంటుండగా.. కొందరు యువకులు మట్కా నిర్వాహకుల వద్ద మట్కా చీటీలు రాసేందుకు రోజు కూలీలా పని చేస్తున్నారు. చాపకింద నీరులా కొనసాగుతున్న మట్కా నిర్వాహణపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని