logo

మైనర్లు.. బైకు షికార్లు

బైకు నడపడమంటే పిల్లలకు ఎనలేని ఆసక్తి. ఇంట్లో మోటారు సైకిల్‌ కనిపిస్తే చాలు.. వీధుల్లో.. లేదంటే ఏకంగా ప్రధాన రహదారులపై షికార్లు చేస్తున్నారు.. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ సంబరపడిపోతున్నారు.

Published : 06 Feb 2023 03:17 IST

నగర శివారులో మోటారు సైకిల్‌ నడుపుతున్న మైనర్‌

న్యూస్‌టుడే, కర్నూలు నేరవిభాగం: బైకు నడపడమంటే పిల్లలకు ఎనలేని ఆసక్తి. ఇంట్లో మోటారు సైకిల్‌ కనిపిస్తే చాలు.. వీధుల్లో.. లేదంటే ఏకంగా ప్రధాన రహదారులపై షికార్లు చేస్తున్నారు.. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ సంబరపడిపోతున్నారు. పిల్లల సరదా కాదనలేని కొందరు తల్లిదండ్రులు వారిని పోత్రహిస్తున్నారు. మైనర్లు వాహనాలు నడపటం చట్ట విరుద్ధమనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదే ప్రమాదాలకు కారణమవుతోంది. జిల్లాలో పట్టణాలు మొదలుకుని మారుమూల గ్రామాల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. పలువురు మైనర్లు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అతివేగం, ట్రిపుల్‌ రైడింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. మరికొందరు మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

నిరంతరం తనిఖీలు

కర్నూలు నగరంలో ప్రతిరోజూ వందలాది మంది మైనర్లు నిబంధనలకు విరుద్ధంగా మోటారు సైకిళ్లు నడుపుతున్నారు. ముఖ్యంగా కళాశాలలకు వెళ్లేవారు ఎక్కువగా వాడుతున్నారు. ఇష్టానుసారంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీటన్నింటిని గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలు నడిపే మైనర్లే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా పలు కూడళ్లలో వాహనాల తనిఖీలు చేపట్టి మైనర్లను పట్టుకుంటున్నారు. వారి తల్లిదండ్రులను పోలీసుస్టేషన్‌కు పిలిపించి మంత్రణం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఎదురయ్యే పరిణామాలపై అవగాహన కల్పించి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జరిమానా విధించి మరోసారి నడపమని ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

కొన్ని ఘటనలు..

* కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి కుమారుడు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండేవాడు. కళాశాలకు ప్రతిరోజూ బైకుపై వెళ్లేవాడు. బళ్లారి చౌరస్తా ఉపరితల వంతెనపై ప్రమాదవశాత్తు రహదారి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.

* కర్నూలు బుధవారపేటకు చెందిన ఓ వ్యాపారి కుమారుడు (17) రాజ్‌విహార్‌ సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండేవాడు. కళాశాలకు బైకుపై వెళ్తూ రాజ్‌విహార్‌ హంద్రీ వంతెనపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

* కర్నూలు శరీన్‌నగర్‌కు చెందిన ఓ మైనర్‌ కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. తెలంగాణ రాష్ట్రం అలంపూర్‌కు వెళ్లి మద్యం తాగి తిరిగి కర్నూలు వచ్చే క్రమంలో 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలారు.

గడిచిన మూడు నెలల్లో..

ట్రాఫిక్‌ పోలీసులు గతేడాది నవంబరులో 133, డిసెంబరు-134, జనవరిలో 113 మైనర్లపై కేసులు నమోదు చేసి రూ.3.16 లక్షల వరకు జరిమానా విధించారు. గతేడాది ఒక్కో కేసు నమోదుకు సంబంధించి రూ.535 జరిమానా మాత్రమే విధించేవారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏకంగా రూ.1,535 వరకు విధిస్తున్నారు.

పిల్లల భవిష్యత్తు నాశనం చేసినట్లే..

నాగభూషణం, డీఎస్పీ, కర్నూలు ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌

పిల్లల వాహనాలు నడపటమంటే వారి భవిష్యత్తును వారు దెబ్బతీసుకోవడమే. వారు ప్రమాదాలకు గురై గాయపడితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. వీరి కారణంగా ఇతరులు ప్రాణాలు కోల్పోయినట్లయితే వారిపైనా కేసు నమోదవుతుంది. ఒక్కసారి కేసు నమోదైతే వారికి భవిష్యత్తు ఉండదు. వీరి కారణంగా రహదారి ప్రమాదాలు జరిగితే వాహన యజమానిని బాధ్యులం చేస్తాం. మైనర్లపై స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని