logo

కలవరపెడుతున్న కార్చిచ్చు

నల్లమల అటవీ ప్రాంతంలో ఏటా కార్చిచ్చు తీవ్ర నష్టం మిగిల్చుతోంది. వన సంపదతో పాటు వన్యప్రాణులను దహించి వేస్తోంది. గడ్డి క్షేత్రాలతో పాటు భారీ వృక్షాలు అగ్నికి ఆహుతవుతున్నాయి

Published : 07 Feb 2023 04:30 IST

 ఏటా దగ్ధమవుతున్న నల్లమల అటవీ ప్రాంతం
పర్యవేక్షకులు, వాచ్‌టవర్ల ఏర్పాటులో ఉదాసీనత

దోమలపెంట రేంజ్‌ పరిధిలో తబిసిపెంట అటవీ ప్రాంతంలో మంటలు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : నల్లమల అటవీ ప్రాంతంలో ఏటా కార్చిచ్చు తీవ్ర నష్టం మిగిల్చుతోంది. వన సంపదతో పాటు వన్యప్రాణులను దహించి వేస్తోంది. గడ్డి క్షేత్రాలతో పాటు భారీ వృక్షాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. నల్లమల అరణ్యం నంద్యాల జిల్లాలో 3.45 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ప్రత్యేకించి శ్రీశైలం, ఆత్మకూరు ప్రాంతాల్లో ఏటా ఫిబ్రవరి నుంచే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతేడాది సున్నిపెంట, శిఖరేశ్వరం, పెచ్చెరువు పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 20 ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమైంది. దోర్నాల, నాగలూటి ప్రాంతాల్లో మంటలు వ్యాపించి కొంత మేరకు నష్టం వాటిల్లింది. మంటలు వ్యాపించాక హడావుడి చేసేకంటే.. ముందుగానే కట్టడి చర్యలు చేపడితే ఫలితం ఉంటుంది. ఈ దిశగా అధికారులు అడుగులు వేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
*  ఉపగ్రహం అందించే సమాచారంతో అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా అందిపుచ్చుకోవడంలోఅటవీ యంత్రాంగం విఫలమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
ఫైర్‌ వాచర్లను నియమిస్తున్నాం :  శ్రీనివాసరెడ్డి, అటవీ క్షేత్ర సంచాలకులు, సున్నిపెంట
తాత్కాలిక పద్ధతిలో 400 మంది ఫైర్‌ వాచర్లను నియమిస్తున్నాం. వాచ్‌ టవర్ల ప్రతిపాదనలు లేవు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కార్చిచ్చు నివారణ ప్రయత్నాలు చేస్తున్నాం.

పాదయాత్రలు మొదలవుతున్నా పట్టింపేదీ..?

* అరణ్యంలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ఏటా ఫిబ్రవరి నుంచి జులై వరకు తాత్కాలికంగా ఫైర్‌ వాచర్లను నియమించుకుంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వాహనాలు, మంటలను ఆర్పే పరికరాలను అందిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ ప్రయత్నాలు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి.
* శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు వేలాదిమంది భక్తులు పాదయాత్రగా చేరుకుంటారు. పాదయాత్ర భక్తులు, యాత్రికులు ఈనెల 14 నుంచే వెంకటాపురం, పెచ్చెరువు ప్రాంతాల నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ప్రతి సంవత్సరం ఇదే సమయంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
* నడకదారులు చలి మంటలు వేయడం, పొగ తాగే అలవాటు ఉన్న వారి వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పాదయాత్ర సాగే మార్గంలో పర్యవేక్షణకు సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రమాదాలను కట్టడం చేసేందుకు వీలవుతుంది. ఈ విషయం తెలిసినా ఇప్పటి వరకు ఫైర్‌ వాచర్లను నియమించలేదు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని