logo

శీఘ్రమేవ మల్లన్న దర్శన ప్రాప్తిరస్త్చు

శ్రీశైల మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

Updated : 07 Feb 2023 06:06 IST

బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఇబ్బంది పడకుండా

రథశాల పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యూలైన్‌

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గతేడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 8.57 లక్షల మంది భక్తులు క్యూలైన్ల ద్వారా భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ఈసారి భక్తుల సంఖ్య పది లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూలైన్ల విస్తరణకు చర్యలు చేపట్టారు.
* బ్రహ్మోత్సవాల్లో భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించడానికి క్యూలైన్లలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి చంద్రావతి కల్యాణ మండపం నుంచే శివదీక్షా భక్తులు దర్శనానికి రావాల్సి ఉంటుంది. ఉచిత దర్శనం భక్తులకు రథశాల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యూలైన్ల వద్ద నుంచి ప్రవేశం కల్పిస్తారు. రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500 అతి శీఘ్ర దర్శనాలకు ప్రత్యేక వరుసలు ఉంటాయి.
* దేవస్థానం క్యూ కాంప్లెక్స్‌లో మొత్తం 16 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో ఆరు కంపార్ట్‌మెంట్లను శీఘ్ర దర్శనానికి (రూ.200) వినియోగించనున్నారు.
క్యూలైన్లను విస్తరించాం : ఎస్‌.లవన్న, ఈవో, శ్రీశైల దేవస్థానం
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని క్యూలైన్ల విస్తరణ చర్యలు చేపట్టాం. రథశాల పక్క నుంచి తాత్కాలిక క్యూలైన్లలో ఉచిత దర్శనం భక్తులను అనుమతిస్తాం. విరాళ కేంద్రం పక్కన అదనపు క్యూలైన్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అల్పాహారం, మంచినీరు తదితర సదుపాయాలు కల్పిస్తున్నాం. మల్లన్న దర్శనానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం.
*నాలుగు రకాల క్యూలైన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.  
* రథశాల పక్కన దుకాణాలు ఖాళీ చేసిన ప్రదేశంలో తాత్కాలిక క్యూలైన్‌ పనులు చేపడుతున్నారు.  
*విరాళ కేంద్రం పక్కన ఖాళీ స్థలంలో క్యూలైన్ల నిర్మాణం చేస్తున్నారు.
* నాగులూటి నుంచి పాదయాత్రగా వచ్చే భక్తులు స్వామివారిని త్వరగా దర్శనం చేసుకునేలా ప్రత్యేకంగా క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. పాదయాత్రలో కంకణం ధరించిన భక్తులను మాత్రమే ప్రత్యేక క్యూలైన్లోకి అనుమతిస్తారు.
* ప్రస్తుతం స్వామివారి ఆలయంలో 3 క్యూలైన్లు ఉన్నాయి. ఇప్పుడు 4 వరుసలుగా మార్పులు చేస్తున్నారు.
* అమ్మవారి ఆలయంలో 2 వరుసలు ఉండగా 3 క్యూలైన్లు సిద్ధం చేస్తున్నారు.
* లింగాయతి సత్రం పక్కన భక్తుల సౌకర్యార్థం పాదరక్షల గది, సామగ్రి భద్రపర్చుకునే గదిని అందుబాటులో ఉంచనున్నారు.. పెద్దసత్రం వద్ద ఒకటి, డొనేషన్‌ కౌంటర్‌ పక్కన మరొక క్లాక్‌రూం ఉన్నాయి.
*  క్యూలైన్లలో భక్తులకు  అల్పాహార ప్రసాదం, మంచినీరు, వేడిపాలు, బిస్కెట్లు పంపిణీ చేయనున్నారు.
* అన్ని క్యూలైన్లలో అత్యవసర ద్వారాలు ఉన్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీరు అందుబాటులో ఉంచనున్నారు.
* తొక్కిసలాట జరుగకుండా భద్రతా సిబ్బంది, శివసేవకులు విధులు నిర్వర్తిస్తారు.
* క్యూలైన్లలో మంచినీటి కుళాయిలు, వాష్‌బేసిన్లు, మరుగుదొడ్ల సదుపాయాలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని