logo

లోకేశ్‌ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు పెద్దఎత్తున జనాదరణ లభిస్తోందని, దీనిని చూసి ఓర్వలేక వైకాపా ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 07 Feb 2023 04:30 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రకు పెద్దఎత్తున జనాదరణ లభిస్తోందని, దీనిని చూసి ఓర్వలేక వైకాపా ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. దీనిని చూస్తుంటే ముఖ్యమంత్రి తన ఓటమిని ముందుగానే ఒప్పుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు బి.వి.జయనాగేశ్వరరెడ్డితో కలిసి సోమవారం మాట్లాడారు. తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. సీఎం బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్లవుతున్నా హంతకులను పట్టుకోకుండా ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ సహకరించి ఉంటే పది రోజుల్లోనే ఈ కేసు తేలిపోయేదన్నారు. రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చారని... రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు.

ఎవరిని మోసం చేస్తున్నారు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ప్రాంతంపై వివక్ష చూపుతోందని బీవీ జయనాగేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. అప్పర్‌ భద్రపై తక్షణమే న్యాయ పోరాటమని.. దీనిని ఆపేయాలంటూ ప్రభుత్వం చెబుతోందని.. అసలు ఎవరు.. ఎవరిని ఆదేశించాలని ప్రశ్నించారు. దీనిపై పార్లమెంటులో నిలదీయకుండా పోరాటం చేస్తామని ప్రకటనలతో సరిపెడుతున్నారని అన్నారు. ఆర్డీఎస్‌, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు తెదేపా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. టెండర్లు పిలిచిందని.. మరి చంద్రబాబును రాయలసీమ ద్రోహి అని ఎలా అంటారని నిలదీశారు. దమ్ముంటే గుండ్రేవులకు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్‌ విసిరారు. రాజోలి, జొలదరాశి, బ్రహ్మంసాగర్‌ లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు స్వయాన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపనలు చేశారని, ఒక్క అడుగైనా పడిందా అని ప్రశ్నించారు.    కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పెట్టి దేశాన్ని బాగు చేస్తానంటున్నారని.. మరి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లింది ఎవరు అని నిలదీశారు. మీ రహస్య మిత్రుడి ద్వారా అడ్డుకుని సీమకు అన్యాయం చేస్తున్నది మీరు కాదా అని దుయ్యబట్టారు. గుండ్రేవుల, ఆర్‌డీఎస్‌కు నిధులు మంజూరు చేయాలని, జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
 సోమిశెట్టి వెంకటేశ్వర్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని