logo

కష్టాలు తీర్చరు.. కన్నీళ్లు తుడవరు

తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు బాధితులు కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నా సమస్య పరిష్కారం కావడం లేదు.

Published : 07 Feb 2023 04:30 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు బాధితులు కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నా సమస్య పరిష్కారం కావడం లేదు. నెలలు, ఏళ్ల తరబడి సమయం గడుస్తున్నా ప్రయోజనం శూన్యమే. ఒకరు మరణ ధ్రువీకరణ పత్రం కోసం.. మరొకరు తమ పొలం ఆక్రమణలకు గురైందని.. స్పందించి చర్యలు తీసుకోవాలంటూ విన్నవిస్తూనే ఉన్నారు. నిత్యం తిరిగి తిరిగి అలసిపోతున్నామని.. తమకు కన్నీళ్లే మిగులుతోంది తప్ప.. కష్టాలు తీరడం లేదని వాపోయారు.


మరణ ధ్రువీకరణ పత్రం కోసం..

ఈ చిత్రంలోని మహిళ పేరు గ్రేసమ్మ. ఈమెది పాములపాడు మండలం కృష్ణారావుపేట. ఆమె భర్త లారీ డ్రైవర్‌, క్లీనర్‌గా పనిచేస్తుండేవారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో గతేడాది జులై 21న మృతి చెందారు. అప్పటి నుంచి అతనికి సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రం కోసం తిరుగుతూనే ఉన్నారు. ఆరు నెలలుగా ప్రదక్షిణలు చేస్తున్నా అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మీరైనా స్పందించి పశ్చిమబెంగాల్‌ అధికారులకు లేఖ రాసి తన భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని కలెక్టర్‌కు సోమవారం మొరపెట్టుకున్నారు.

నాలుగేళ్లుగా ప్రదక్షిణలు..

ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు కైరూన్‌బీ. 60 సంవత్సరాలకుపైగా ఉంటుంది. ఆమెది గోనెగండ్ల మండలం ఎర్రబాడుకు గ్రామం. ఆమెకు 4.50 ఎకరాలు ఉంది. ఇందులో ఎకరా పొలాన్ని కొందరు దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్నారు. సర్వే చేసి ఆ పొలాన్ని తన పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆమె సోమవారం కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. గత మూడు, నాలుగేళ్లుగా తిరుగుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. వయస్సు మీద పడటంతో అంత దూరం నుంచి రాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని