logo

Andhra News: రూ.3 లక్షల పెట్టుబడి.. రెండు రోజుల్లో రూ. 30 లక్షల ఆదాయం

రెండు రోజుల్లో రూ.3 లక్షల పెట్టుబడితో ఏకంగా రూ.30 లక్షల ఆదాయం గడించారు. ఇది వ్యాపారం చేసి సంపాదించింది కాదు.

Updated : 21 Feb 2023 08:58 IST

కాయ్‌రాజా కాయ్‌.. రూ.లక్షలు మేసెయ్‌

భోగేశ్వరంలో నిర్వహిస్తున్న కాయ్‌రాజా కాయ్‌

గడివేముల, న్యూస్‌టుడే : రెండు రోజుల్లో రూ.3 లక్షల పెట్టుబడితో ఏకంగా రూ.30 లక్షల ఆదాయం గడించారు. ఇది వ్యాపారం చేసి సంపాదించింది కాదు. భక్తుల నుంచి దోచుకున్నది. స్వామివారిని దర్శించుకుని పిల్లలకు పండ్లు, మిఠాయిలు, ఆటబొమ్మలు తీసుకెళదామని వచ్చిన భక్తులకు ఆశ చూపి వారి జేబులు గుల్ల చేశారు. రూపాయికి రూ.10 అని, రూ.10కి రూ.వంద అని ఆశచూపి వారివద్ద ఉన్నదంతా దోచుకున్నారు. ఇదీ కర్నూలు జిల్లా గడివేములలోని దుర్గాభోగేశ్వర క్షేత్రంలో గ్యాంబ్లింగ్‌ నిర్వాహకులు చేసిన మాయ. పవిత్ర క్షేత్రంలో యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా అధికారులు చూడనట్లు వ్యవరించడంపై పలు ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.

* శ్రీదుర్గాభోగేశ్వర క్షేత్రంలో జరిగిన శివరాత్రి మహోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అక్కడితో ఆధ్యాత్మిక కార్యక్రమం ముగించారు. స్వామి వారిని దర్శించుకుని ప్రశాంతంగా ఇళ్లకు వెళాల్సిన భక్తులను ప్రలోభపెట్టేందుకు కొందరు ఇక్కడ జూద కార్యక్రమాలు నిర్వహించారు. భోగేశ్వరంలో కాయ్‌రాజా కాయ్‌ ఆట నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా మండలంలో ఇలాంటి ఆటను నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకునేవారు. ఈఏడాది అధికారులే అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిర్వాహకులు రెచ్చిపోయారు. పదుల సంఖ్యలో టేబుళ్లు ఏర్పాటు చేసి బహిరంగంగా ఆట నిర్వహించారు. భక్తుల నుంచి రెండు రోజుల పాటు యథేచ్ఛగా దోచుకున్నారు.

మామూళ్లు ఇచ్చి దోపిడీ

కాయ్‌ రాజాకాయ్‌ ఆట నిర్వహణకు అధికారులకు రూ.3 లక్షల మామూళ్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే బహిరంగంగా జూదక్రీడ నిర్వహించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. భక్తుల నుంచి రెండు రోజుల్లో రూ.30 లక్షలు దోచుకున్నట్లు చర్చించుకుంటున్నారు. కొందరు తెచ్చుకున్న డబ్బులు అయిపోతే ఇంటికెళ్లి తెచ్చుకుని మళ్లీ ఆడటం గమనార్హం. చిన్నపిల్లలు, యువకులు సైతం డబ్బులు పోగొట్టుకున్నారు. రూ.వేలల్లో డబ్బు పోగొట్టుకున్న వారు లబోదిబోమంటున్నారు. మండలంలో ఎన్నడూ లేని విధంగా కాయ్‌రాజా కాయ్‌కు అనుమతులు ఇచ్చిన అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని