logo

ఖాళీ స్థలం.. అధికార ఆదాయం

చేనేత పురిలో అధికార పార్టీ నేతలు కొత్త దందా మొదలుపెట్టారు. ఆదాయ వనరుల పేరిట ఖాళీ స్థలాల్లో దుకాణాలు నిర్మిస్తున్నారు.

Published : 05 Mar 2023 01:39 IST

దుకాణాల నిర్మాణమంటూ దందా 
రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు

ఎమ్మిగనూరులో తొలగించిన చిరు వ్యాపారుల దుకాణాలు

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు: చేనేత పురిలో అధికార పార్టీ నేతలు కొత్త దందా మొదలుపెట్టారు. ఆదాయ వనరుల పేరిట ఖాళీ స్థలాల్లో దుకాణాలు నిర్మిస్తున్నారు. అక్కడ ఏళ్లుగా జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయించి దుకాణాల పేరిట దూరి పోతున్నారు. చేతికి మట్టి అంటకుండా ఆయా శాఖల ఆధ్వర్యంలో దుకాణాలు నిర్మిస్తున్నారు. వాటి కేటాయింపులో ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక్కో దుకాణానికి రూ.9 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌ యార్డు సమీపంలో, స్టేషన్‌ పక్కన, చిరు వ్యాపారుల దుకాణాలు ఇటీవల పురపాలక శాఖ అధికారులు దౌర్జన్యంగా తొలగించారు. పురపాలక సంఘంలోని ఓ ప్రజా ప్రతినిధి తెర వెనుక చక్రం తిప్పి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.’

మార్కెట్‌ యార్డులో పాగా

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గతంలో ఎలాంటి దుకాణాలు లేవు. వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చాక.. ఆదాయ వనరుల పేరిట దుకాణాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కోసిగి దారిలో ఎనిమిది, ఆదోని- మంత్రాలయం రహదారిలో ఎనిమిది నిర్మించారు. గుడ్‌విల్‌, ప్రజా ప్రతినిధి మామూళ్ల కింద దాదాపు రూ.50 లక్షలకు పైగా వసూలు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన పురపాలక ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్లు సమాచారం.

రూ.వంద కోట్ల ఆస్తులపై కన్ను

వీవర్స్‌ కాలనీలో మైదానం పేరుతో సర్వే నంబరు 431లో 6.23 ఎకరాల స్థలాన్ని వదిలేశారు. 1947 మద్రాసు చట్టం ప్రకారం ఈ స్థలాలు పురపాలక చట్టం పరిధిలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఓపెన్‌ స్థలం కింద రావడంతో ప్రజల సౌకర్యార్థం వ్యాయామం, క్రీడలు ఇతర సౌకర్యాలకు స్థలం వదలిపెట్టాలి. ఈ స్థలంపై ఎవరికీ హక్కు ఉండదు. ఇక్కడ సెంటు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. ప్రస్తుతం అక్కడ కొందరితో డబ్బాలు వేయించారు. దాని విలువ రూ.50 లక్షలు ఉంటుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి జోక్యంతో మైదానంలో 12 రేకుల షెడ్లు వెలిశాయి. మామూళ్లు తీసుకుని ప్రోత్సహించారనే ఆరోపణలున్నాయి.

పేదల బతుకులు కూల్చి..

* ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీనివాస కూడలి నుంచి మార్కెట్‌ యార్డుకు వెళ్లే దారి పక్కన 25 మంది చిరు వ్యాపారులు గత 40 ఏళ్లుగా బతుకుబండిని లాగిస్తున్నారు. డబ్బాలు వేసుకుని వడ్రంగి, దర్జీ, పండ్లు, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏటా మున్సిపాలిటీకి రూ.2,500 పన్ను చెల్లిస్తున్నారు. ప్రధాన రహదారి, ఆసుపత్రి పక్కనే ఉండటంతో ఇక్కడ సెంటు రూ.20 లక్షల వరకు పలుకుతోంది. ఇంకేముంది ఖాళీ స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. అక్కడ దుకాణాలు నిర్మించాలని పుర అధికారులను ఆదేశించారు. ‘అధికారం’ ఆదేశించడంతో అధికారులు చిరు వ్యాపారుల స్థావరాలు కూల్చివేశారు.

* ఖాళీ స్థలంలో 21 దుకాణాలు నిర్మించేందుకు పురపాలక శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. నిబంధనల ప్రకారం పట్టణ ప్రణాళిక అనుమతులు తీసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్మాణాలకు శ్రీకారం చుట్టాలి. ఇవేవీ ఇక్కడ కొనసాగడం లేదు. ఒక్కో దుకాణం నిర్మాణానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల బేరం కుదిరినట్లు సమాచారం. ఇందులో ‘అధికార’ మామూళ్లు రూ.9 లక్షలు సమర్పించుకోవాల్సి ఉంటుందని నేతలు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. దుకాణాలన్నీ తన అనుచరులకే ఇప్పించుకోవడానికి ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నిస్తున్నారు. ‘మాకు దుకాణాలు ఇవ్వండని సదరు ప్రజాప్రతినిధి వద్దకు చిరు వ్యాపారులు వెళ్తే.. మీకు ఇచ్చేది లేదు.. ఇతరులకు ఇచ్చేస్తాం’ అని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.

పాత భవనాలు కూల్చి..

పట్టణంలో పోలీస్‌స్టేషన్‌ పక్కన పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయి. అక్కడున్న పాత భవనాలు కూల్చి వేశారు. ప్రణాళిక విభాగం అధికారుల అనుమతులు లేకుండానే దుకాణాల నిర్మాణానికి పునాదులు వేశారు. ఒక్కో దుకాణానికి నేతలు రూ.9 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు రాకుండానే నిర్మాణాలు ప్రారంభించారు.


30 ఏళ్ల నుంచి జీవనం

ఓంకారప్ప, చిరు వ్యాపారి, ఎమ్మిగనూరు

30 ఏళ్ల నుంచి ఆసుపత్రి పక్కనే స్థలంలో చిన్న గుడిసె వేసుకొని జీవనం సాగిస్తూ.. వ్యాపారం చేస్తున్నాం. తడకలు అల్లి అమ్ముకుంటూ బతుకున్నాం. ఆ డబ్బుతో మా కుటుంబాన్ని పోషిస్తున్నా. నెల రోజుల కిందట గుడిసె, బండలు తొలగించారు. జీవనాధారం కోల్పోయాం. దుకాణాలు నిర్మించి తమకు ఇవ్వాలని అడిగినా అధికారులు, ప్రజాప్రతినిధి స్పందించలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని