పెద్దాసుపత్రికి గుండెపోటు
కర్నూలు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన నాగార్జునకు 34 ఏళ్లు.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో చేరారు.
సర్వజన వైద్యశాలలో కార్డియాలజీ విభాగం
కర్నూలు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన నాగార్జునకు 34 ఏళ్లు.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో చేరారు. పరీక్షలు చేయగా గుండెపోటు అని వైద్యులు నిర్ధారించారు. కార్డియాలజీ విభాగం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు నగరానికి చెందిన 27 ఏళ్ల లోకేశ్ గత నెలలో గుండెనొప్పి రావడంతో కార్డియాలజీ విభాగంలో చేరి వైద్యం పొందారు.
కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికే గుండెజబ్బులు వస్తాయనుకునేవారు. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. మూడు పదుల వయసులోనే గుండెపోటుతో చనిపోతున్నవారు ఎక్కువగా ఉంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు సర్వజన వైద్యశాలకు నెలకు 100 వరకు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు, ఒంగోలు, అనంతపురం, తెలంగాణ రాష్ట్రం గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి బాధితులు వస్తుంటారు. ఇక్కడ క్యాథ్‌ల్యాబ్ పని చేయకపోవడంతో ప్రైవేటుకు పంపిస్తున్నారు.
టెండర్ల దశలోనే క్యాథ్‌ల్యాబ్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 89 పీహెచ్‌సీలు, 18 సీహెచ్‌సీలు, నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఆదోని ప్రాంతీయ ఆసుపత్రులు ఉన్నాయి. ఎక్కడా గుండె వ్యాధులకు సంబంధించి వైద్య సేవలు లేవు. గుండెపోటు వచ్చిందంటే బాధితులు 108 వాహనంలో పెద్దాసుపత్రికి చేరాల్సిందే. అక్కడ క్యాథ్‌ల్యాబ్ మరమ్మతులకు గురైంది. కొత్తది ఏర్పాటు చేయాలని టెండర్లు పిలిచి ఏడాదైనా అతీగతీ లేదు. క్యాథ్‌ల్యాబ్ లేకపోవడంతో కేవలం నాడి పట్టి ప్రైవేటుకు రెఫర్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏ మూల నుంచి కర్నూలుకు రావాలన్నా సుమారు 100 కి.మీ. దాటాల్సిందే. అక్కడి నుంచి వచ్చేలోగా వైద్యం అందక ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.
ఓపీ వెయ్యి దాటుతోంది
సర్వజన వైద్యశాలలోని గుండె జబ్బుల విభాగానికి నెలకు 1,100 నుంచి 1,200 వరకు ఓపీ ఉంటోంది. అందులో 250 నుంచి 300 మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. ఆసుపత్రిలో టూడీ ఎకోలు 15 వేలు ఉన్నాయి.. వాటిలో యాంజియోగ్రామ్‌లు ఏడాదికి 800 వరకు ఉంటున్నాయి. 300 మందికి స్టెంట్లు వేస్తున్నారు. కార్డియోథోరాసిక్ విభాగంలో నెలకు 10 నుంచి 15 మందికి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు ఆసుపత్రి లెక్కలు చెబుతున్నాయి.
ప్రైవేటుకు పంపిస్తున్నారు
సర్వజన వైద్యశాలలో క్యాథ్‌ల్యాబ్ మరమ్మతులకు గురై రెండేళ్లు అవుతోంది. యాంజియోగ్రామ్, స్టెంట్‌లు వేసే పరిస్థితి లేదు. బాధితులను విశ్వభారతికి పంపిస్తున్నారు. 891 యాంజియోగ్రామ్‌లు, 263 స్టెంట్లు విశ్వభారతి ఆసుపత్రిలో చేశారు. ఆసుపత్రికొచ్చే ఆరోగ్యశ్రీ నిధులు మళ్లించి చేయడం గమనార్హం. ఆరోగ్యశ్రీ సేవలూ కొరవడటంతో సేవా రుసుము ఆసుపత్రికి రావడం లేదు. వైద్యశాలలో డీఎం సీటు పొందినవారు పాఠాలు నేర్చుకోవాలంటే ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. కొవిడ్ రాకముందు కార్డియోథోరాసిక్ విభాగంలో ఏడాదికి 200 గుండె శస్త్రచికిత్సలు చేసేవారు. ఆ తర్వాత వాటి సంఖ్య వందకు తగ్గింది. ఈ విభాగంలో చేసే కేసుల సంఖ్య తక్కువ... ప్రచారం ఎక్కువగా ఉందని తోటి వైద్యులు చెప్పుకోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
RC 16: రామ్‌చరణ్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్ కుమార్తె ఫిక్సా..?
-
Locker: బ్యాంక్ లాకర్లలో క్యాష్ పెట్టొచ్చా? బ్యాంక్ నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)