logo

పంట నష్టం.. ఎంత కష్టం

‘మాది రైతుల ప్రభుత్వం.. అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటాం.. పంటల సీజన్‌ సమయంలో అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలకు నష్టం వాటిల్లితే   ఆ మరుసటి నెలలో పంటనష్ట పరిహారం ఇస్తాం’.

Published : 21 Mar 2023 02:26 IST

- న్యూస్‌టుడే, కర్నూలు, నంద్యాల  వ్యవసాయం

‘మాది రైతుల ప్రభుత్వం.. అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటాం.. పంటల సీజన్‌ సమయంలో అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలకు నష్టం వాటిల్లితే   ఆ మరుసటి నెలలో పంటనష్ట పరిహారం ఇస్తాం’.

పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి అన్న మాటలివి.!!

క్షేత్రస్థాయిలో అమలుతీరు భిన్నంగా ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతివృష్టి, అనావృష్టి, తెగుళ్లు, నాసిరకం విత్తనాలు.. కారణం ఏదైనా పంటలకు నష్టం వాటిల్లుతోంది. గతేడాది ఖరీఫ్‌లో జులై, ఆగస్టు నుంచి ఇప్పటి వరకు పంట చేతికొచ్చే సమయంలో వర్షార్పణం అవుతోంది. కర్నూలు జిల్లాలో సెప్టెంబరు, అక్టోబరులో జరిగిన నష్టాన్ని కుదించి కొందరికే పరిహారం ఇచ్చారు. నంద్యాల జిల్లాలో సెప్టెంబరు, అక్టోబరు నెలలతోపాటు మాండోస్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇచ్చారు. నాలుగు రోజుల కిందట కురిసిన వడగళ్ల వర్షానికి వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. నష్టాన్ని గణించాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి.

ఇచ్చింది పిసరంతే

* కర్నూలు జిల్లాలో సెప్టెంబరులో 9,596 ఎకరాలు, అక్టోబరులో 18,526 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 1,289.36 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. రూ.3.86 కోట్ల మేర పంట నష్టం  తేల్చారు.  

* గతేడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పంట నష్టం జరిగితే నవంబరు 28వ తేదీన పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. హొళగుంద, కల్లూరు, కౌతాళం, మంత్రాలయం, పెద్దకడబూరు, కోసిగి మండలాల్లో 936.22 హెక్టార్లలో 1,630 మంది రైతులు నష్టపోయారని నిర్ధారించారు. వీరికి రూ.1.38 కోట్ల పంట పరిహారం మంజూరు చేశారు. అక్టోబరులో 451.60 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 850 మంది రైతులకు నష్టం జరగ్గా రూ.67.74 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ఇచ్చింది. సెప్టెంబరులో 1,406 మంది రైతులకు సంబంధించి 954 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగితే గుర్తించ (ఎన్యుమరేషన్‌ ) లేదు.

నష్టాన్ని గణించలేదు

* కర్నూలు జిల్లా పరిధిలో గతేడాది ఆగస్టులో 134.76 హెక్టార్లలో ఉద్యాన, 2 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లితే పంటల నష్టాన్ని గణించలేదు.

* గతేడాది డిసెంబరు నెలలో మాండోస్‌ తుపాను కారణంగా కర్నూలు మండలంలో 5 గ్రామాల్లో 155 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది.  కోత దశలో ఉండటంతో పంట నష్టాన్ని గణించలేదు.

* మాండోస్‌ తుపాను, అధిక వర్షాల  కారణంగా నంద్యాల జిల్లాలో 10,778 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని  వసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

ముంచిన వడగళ్లు

ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్లకు కర్నూలు మండలంలో 9 గ్రామాల్లో రూ.1.62 కోట్ల మేర పంటనష్టం వాటిల్లింది. ఉద్యాన పంటల విషయానికొస్తే 33.90 హెక్టార్లలో రూ.5.37 లక్షల విలువైన పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. నంద్యాల జిల్లాలో 15 మండలాల్లో 115 గ్రామాల్లో 7,513 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఈ నెలాఖరులోగా పంట నష్ట గణన చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.


ఒక్క రాత్రిలో పంటంతా నాశనమైంది
- అల్లూరి పెద్ద గంగన్న, గుల్లదుర్తి, కోవెలకుంట్ల

బీఏ చదివి, ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడిని. ఆ పని మానుకొని రెండేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఈ ఏడాది ఎకరా రూ.35 వేల చొప్పున నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఒక ఎకరా శనగ , మిగిలిన మూడెకరాల మిరప సాగు చేశా. సూపర్‌ 10 రకానికి చెందిన విత్తనం ఒక్కో ప్యాకెట్‌ రూ.వెయ్యి చొప్పున 12 ప్యాకెట్లు నంద్యాల నుంచి తెచ్చి నాటా. విత్తనం, సేద్యాలు, నాట్లు, కలుపుతీత, ఎరువులు అంతా కలిపి రూ.7 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. బ్యాంకులో బంగారం తనఖా పెట్టి రూ.2 లక్షలు, మిగిలిన రూ.5 లక్షలు బయట వడ్డీకి తెచ్చా. పంట కాపు బాగా కాసింది. నా కొడుకు కర్నూలులో బీ.ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. రూ.80 వేలు ఫీజుకుగానూ రూ.20 వేలు చెల్లించాం. మిగిలిన ఫీజులు మిరప కోత కోయగానే చెల్లించాలనుకున్నాం. కూలీల కొరత ఉండటంతో ఉగాది పోగానే కోత మొదలు పెడదామనుకున్నా. ఇంతలో వడగళ్ల వాన వచ్చింది. ఒకే రాత్రిలో పంటంతా నాశనమైంది. వడగళ్ల ధాటికి చెట్టుకున్న కాయలు పగిలి, నేలరాలి చెల్లాచెదరుగా పడ్డాయి. తెల్లవారిన తర్వాత పొలానికెళ్లి చూస్తే  పంట సర్వనాశనమైంది. నా భార్య బీఏ, బీఈడీ చేసినప్పటికీ నాతోపాటు ఎంతో కష్టపడి పని చేసింది. పిల్లల చదువు కోసమని అప్పులు చేసి వ్యవసాయం చేస్తే మా కష్టమంతా వర్షం పాలైంది.

న్యూస్‌టుడే, కోవెలకుంట్ల


కుమారుడిని మంచి కళాశాలలో చదివించాలనుకున్నా
- ఖాదర్‌వలీ, ముత్యాలపాడు,

గ్రామంలో 2.5 ఎకరాల. పొలమే ఆధారం . కుమార్తె రసూల్‌బీ గ్రామంలోని ఎస్పీజీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కుమారుడు చాగలమర్రి పట్టణంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది నాకున్న పొలంలో మొక్కజొన్న సాగు చేశా. ఎకరానికి రూ.30 వేల చొప్పున 2.5 ఎకరాలకు రూ.75 వేలు పెట్టుబడి పెట్టి 75 రోజుల పాటు పంటను కంటికి రెప్పలాగా కాపాడుకున్నా. పంట దిగుబడి వచ్చేసరికి కుమారుడి పది పరీక్షలు పూర్తవుతాయి. వచ్చిన దిగుబడి, ఆదాయంతో కుమారుడిని మంచి కళాశాలలో చేర్పించాలనుకున్నా. వడగళ్ల వాన ఆశలన్నింటినీ అడియాసలు చేసింది. పంట దేనికీ పనికి రాకుండా మొత్తం నేలమట్టం అయిపోయింది. మొక్కజొన్న కంకులకు గింజలు పాలదశలో ఉండగా నేలవాలడంతో పంట చేతికి రాకుండా పోయింది. పెట్టిన పెట్టుబడంతా మట్టిపాలైంది. కుమారుడిని మంచి కళాశాల చేర్పించాలన్న ఆకాంక్ష తీరకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

న్యూస్‌టుడే, చాగలమర్రి


కుమార్తె పెళ్లి ఎలా చేయాలో
- పి.సుందరయ్య, పాదకందుకూరు, ఆళ్లగడ్డ

రెండు ఎకరాల్లో నువ్వులు సాగు చేశా. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టా. పంట బాగా పండటంతో గత శుక్రవారం ఉదయం కోత కోసేందుకు సిద్ధమయ్యా. గురువారం రాత్రి వడగళ్లు, ఈదురు గాలులతో వర్షం పడటంతో పంట మొత్తం నేలమట్టమైంది. చేతికొచ్చే పంట వానధాటికి మట్టిపాలైంది. రెండు ఎకరాలకు రూ.60 వేల వరకు ఖర్చు చేశా. ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. బయట మార్కెట్‌లో క్వింటా రూ.15 వేలు పలుకుతోంది. ఈ లెక్కన రెండు ఎకరాలకు రూ.1.50 లక్షలు చేతికి వచ్చేది. పంట నాశనం కావడంతో ఒక్క రూపాయి రాదు. పంటల సాగు కోసం చేసిన అప్పు రూ.2 లక్షలైంది. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. అబ్బాయి పాలిటెక్నిక్‌ చదువుతుండగా, మరో అబ్బాయి కూలీ పనికి వెళ్తున్నాడు. అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంది. అమ్మాయికి పెళ్లి చేయాలని నిశ్చయించాం. పంట చేతికి వచ్చి డబ్బులు వస్తే అప్పులు తీర్చి ఈ నెలలోనే నిశ్చితార్థం చేయాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడేం చేయాలో దిక్కుతోచడం లేదు. అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు.

న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం


తడిసింది.. నాణ్యత తగ్గింది

మంత్రాలయం మండలం సూగూరుకు చెందిన బోయ నరసింహులు మూడెకరాల్లో మిరప సాగు చేశారు.  రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిపోయి నాణ్యత తగ్గింది.

న్యూస్‌టుడే కౌతాళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని