logo

ఆస్తి కోసం కుమారుడు వేధిస్తున్నాడు

ఆస్తి కోసం కుమారుడు వేధిస్తున్నాడని.. ఉద్యోగం పేరుతో మోసగించారని.. ఇలా పలువురు తమ సమస్యలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు విన్నవించారు.

Published : 21 Mar 2023 02:26 IST

బాధితుల సమస్య వింటున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఆస్తి కోసం కుమారుడు వేధిస్తున్నాడని.. ఉద్యోగం పేరుతో మోసగించారని.. ఇలా పలువురు తమ సమస్యలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు విన్నవించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలు విని వినతులు స్వీకరించారు. విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 107 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెబ్‌ అదనపు ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌, అదనపు ఎస్పీ ప్రసాద్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ వెంకటాద్రి, న్యాయ సలహాదారు మల్లికార్జున పాల్గొన్నారు.

వినతుల్లో కొన్ని..

* తన కుమారుడు ఆస్తి కోసం వేధిస్తున్నాడని వెల్దుర్తి మండలం పుల్లగుమ్మికి చెందిన శేషిరెడ్డి విన్నవించుకున్నారు.

* నకిలీ దస్తావేజులతో కొందరు తన స్థలాన్ని అమ్మి మోసగించారని కర్నూలు మండలం స్టాంటన్‌పురానికి చెందిన విజయకుమార్‌ ఫిర్యాదు చేశారు.

* షేర్‌ మార్కెట్‌లో డబ్బులు పెడితే రెట్టింపు నగదు వస్తుందని నమ్మించి పెట్టుబడి పెట్టించి మోసం చేశారని కర్నూలు సీతారామ్‌నగర్‌కు చెందిన నాగజ్యోతి విన్నవించారు.

* తనకు ఇద్దరు కుమార్తెలు సంతానమని భర్త చనిపోవటంతో తన మరిది పొలాన్ని ఎక్కువ ధరకు అమ్మి తక్కువ ధరకు విక్రయించినట్లు మోసగించారని, న్యాయం చేయాలని ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెకు చెందిన చంద్రిక కోరారు.

* కర్నూలు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారని ప్రకాశం జిల్లా కొమరవోలు మండలం ఎర్రపల్లెకు చెందిన వినయ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

* తనకు జీవనాధారంగా ఉన్న ఇంటిని రాసివ్వాలంటూ చిన్న కోడలు ఇబ్బంది పెడుతోందని, రక్షణ కల్పించాలని ఖండేరివీధికి చెందిన షేహిజారిబేగం ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని