logo

చెరువును చెరిపిన అధికారం

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ‘అధికారం’ అధీనం చేసుకుంటోంది. స్థానికులు అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు. విన్నవించినా అధికారులు తమ వల్ల కాదంటున్నారు.

Published : 23 Mar 2023 02:06 IST

రూ.2 కోట్ల స్థలం కబ్జా 
వైకాపా నాయకుడి దౌర్జన్యం

చెరువు కట్ట ముందు భాగంలో ఖాళీ స్థలాన్ని మట్టితో నింపేశారు ఇలా

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ‘అధికారం’ అధీనం చేసుకుంటోంది. స్థానికులు అడ్డుకుంటే దాడులకు దిగుతున్నారు. విన్నవించినా అధికారులు తమ వల్ల కాదంటున్నారు. పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలో రూ.2 కోట్ల విలువైన చెరువు స్థలానికి వైకాపా నాయకుడు ఎసరు పెట్టారు.  కొంత భాగం చదును చేసుకుంటూ కాజేసేందుకు యత్నిస్తున్నారు. చెరువు స్థలాన్ని సదరు నాయకుడు ఆక్రమించుకుంటుండగా అడ్డుకోబోయిన ఆయకట్టు రైతులను కాలితో తన్నడమే కాదూ.. వారిపై దాడులకు దిగారు. ఈ ఘటన జరిగి మూడు రోజులవుతున్నా అధికారులు స్పందించకపోవడం గమనార్హం.


తూముకు తూట్లు

తూమును మట్టి కుప్పలతో కప్పేశారు

పత్తికొండలో సర్వే నంబరు 602-2లో 184.5 ఎకరాలు, 602-2ఏలో 35 సెంట్ల స్థలం విస్తీర్ణంలో చెరువు ఉంది. 180 ఎకరాలు సాగవుతోంది. వర్షాకాలంలో అధిక నీరు వస్తే బయటకు వెళ్లడానికి రెండు చోట్ల తూములు ఏర్పాటు చేశారు. చిన్న తూము ముందు భాగంలో 1.5 ఎకరాలు ఖాళీగా ఉంది.. దీని విలువ ప్రస్తుతం సుమారు రూ.2 కోట్లు పలుకుతోంది. దీనిని ఆక్రమించేందుకు పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పథకం పన్నారు. ఆ స్థలంలోకి నీరు రాకుండా చెరువు మట్టినే తవ్వి చదును చేయడం గమనార్హం. అంతే కాకుండా నీరు పారేందుకు నిర్మించిన తూమునూ పూడ్చి వేసేందుకు మట్టి తరలించారు.

ఇళ్లు మునగడం ఖాయం

చెరువు నిండిన సమయంలో నీరు బయటకు రాకుండా తూమును పూడిస్తే సమీపంలోని కాలనీ మునగడం ఖాయం. ఇళ్లల్లోకి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రమాదం ఉంది. చెరువు నిండితే గ్రామానికి ఎలాంటి నీటి ముప్పు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో పూర్వీకులు తూము నిర్మాణం చేపట్టారు. తూమును మూసేసి.. దాని ముందున్న స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. ఇళ్లల్లోకి నీరొచ్చే ప్రమాదముంది. అయినా సంబంధిత అధికారులకు ఏమీ పట్టడం లేదని స్థానికులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. ‘‘ అవకాశం దొరికినప్పుడల్లా సాబ్దిన్‌ నూర్‌బాషా చెరువు స్థలాన్ని ఆక్రమిస్తూ వస్తున్నాడు. గతంలోనూ ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని’’ ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  


హద్దులు నిర్ణయించి స్వాధీనం :

చంద్రశేఖర్‌, డీఈ, మైనర్‌ఇరిగేషన్‌ శాఖ, పత్తికొండ

హద్దులు నిర్ణయించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. తూము ప్రాంతాన్ని మూసేస్తే ఇళ్లల్లోకి నీరు వెళ్లే ప్రమాదముంది. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు, ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. అంశాన్ని మైనర్‌ ఇరిగేషన్‌ డీఈ చంద్రశేఖర్‌ దృష్టికి తీసుకెళ్లాం.

న్యూస్‌టుడే, పత్తికొండ, పత్తికొండ పట్టణం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని