logo

బెంచీలే అసలు పరీక్ష

‘‘ పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరీక్షల సమయం సమీపిస్తున్నా ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో నేటికీ ఏర్పాట్లు కానరావడం లేదు.

Published : 23 Mar 2023 02:06 IST

ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
బల్లలు సమకూర్చుకోవాలని ఆదేశాలు

రుద్రవరం: ఉన్నత పాఠశాలలో మూలకు చేరిన బల్లలు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ‘‘ పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరీక్షల సమయం సమీపిస్తున్నా ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో నేటికీ ఏర్పాట్లు కానరావడం లేదు. నాడు- నేడు పనులు జరుగుతున్న ఉన్నత పాఠశాలల్లో సమస్యలు ఉన్నాయని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. చాలా చోట్ల బెంచీల సమస్య వేధిస్తోంది. ఎవరి పరిధిలో వారే బల్లలు సమకూర్చుకోవాలని పరీక్షల విభాగం అధికారులు చెప్పడంతో ప్రధానోపాధ్యాయులు మండిపడుతున్నారు. ’’

హాజరు కానున్న 50,720 మంది

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, పురపాలక, నగరపాలక, ఆదర్శ, సాంఘిక, గిరిజన సంక్షేమ, కేజీబీవీ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు 941 వరకు ఉన్నాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 25,366 మంది, నంద్యాలలో 25,354 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం కర్నూలు జిల్లాలో 149 కేంద్రాలు, నంద్యాలలో 125 పరీక్షా కేంద్రాలు ఎంపిక చేశారు. వీటిలో చాలా చోట్ల మనబడి నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ గదులు పడగొట్టారు. బిల్లులు రాకపోవడంతో పనులను గుత్తేదారులు మధ్యలో ఆపేశారు.

ఇక్కడే సమస్య  ఎక్కువ

నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల, చాగలమర్రి, రుద్రవరం, దొర్నిపాడు, గోస్పాడు, ఆత్మకూరు, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లి, కొలిమిగుండ్ల, అవుకు, శిరివెళ్ల మండల కేంద్రాలు, కర్నూలు జిల్లా పరిధిలో కోడుమూరు, సి.బెళగల్‌, గూడూరు, పత్తికొండ, దేవనకొండ, కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, ఆలూరు, ఆస్పరి, వెల్దుర్తి, కర్నూలు, కల్లూరు మండల పరిధిలో ఉన్న పరీక్ష కేంద్రాల్లో పూర్తి స్థాయిలో బల్లలు లేవని అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీటిలో ఎక్కువగా నాడు-నేడు పనులు జరగుతుండడం గమనార్హం. దీంతోపాటు పాఠశాలల విలీన ప్రక్రియ నేపథ్యంలో బల్లల సమస్య మరింత రెట్టింపైనట్లు తెలుస్తోంది.

ప్రత్యేక నిధులేవీ

పరీక్ష కేంద్రాల నిర్వహణకు అయ్యే ఖర్చు పాఠశాలలకు కేటాయించిన గ్రాంట్‌ నుంచి వెచ్చించాలని అధికారులు సలహా ఇచ్చారు. 2022-23 సంవత్సరానికి చెందిన గ్రాంట్‌లో ఇప్పటి వరకు 20 శాతం మంజూరైంది. వాటితో మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాల ఆవరణ శుభ్రం చేయడం, సుద్ద ముక్కల కొనుగోలు, బ్లీచింగ్‌ పౌడర్‌, ఫినాయిల్‌ కోసం ఖర్చు చేశామని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాశాఖకు సమాధానం ఇచ్చారు. కనీసం పెండింగ్‌లో ఉన్న 80 శాతం స్కూల్‌ గ్రాంట్స్‌ మంజూరు చేస్తే కొంతవరకు వసతులు సమకూర్చుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రధానోపాధ్యాయులు.. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రైవేటుకు ప్రాధాన్యం

* నాడు-నేడు పనులు జరుగుతున్న నేపథ్యంలో 70 శాతానికిపైగా ప్రైవేటు పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఇక్కడ వసతులు, బల్లలు ఉంటాయని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. నంద్యాల, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలలను గుర్తించారు. అధికారుల తీరుపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* కర్నూలు నగరంలో 23 ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేయగా.. పశ్చిమ ప్రాంతంలో 27 ఎంపిక చేశారు.

* పత్తికొండ, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, ఓర్వకల్లు, పత్తికొండ, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం, కోడుమూరు, పెద్దపాడులో గ్రామానికి దూరంగా ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం లేనప్పటికీ పరీక్ష కేంద్రాలుగా గుర్తించారు. ప్రధాన రహదారికి దూరంగా ఉన్న పరీక్ష కేంద్రాల వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో బస్సు సౌకర్యం లేని గ్రామాల నుంచి విద్యార్థులు ఆటోలు, ట్రాక్టర్లలో ప్రమాదకరంగా పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు