logo

ఫిష్‌ ఆంధ్ర తుస్‌

వినియోగదారులకు తాజా చేపలు అందించడం.. విక్రయదారులు, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఫిష్‌ ఆంధ్ర’ పేరుతో చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేసింది.

Published : 23 Mar 2023 02:06 IST

రూ.20 లక్షల విలువ చేసే ఫిష్‌ వెండింగ్‌ యూనిట్‌ నమూనా

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : వినియోగదారులకు తాజా చేపలు అందించడం.. విక్రయదారులు, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఫిష్‌ ఆంధ్ర’ పేరుతో చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పథకానికి మరిన్ని మెరుగులు దిద్ది ఫ్రెష్‌ రిటైల్‌ యూనిట్ల ఏర్పాటకు శ్రీకారం చుట్టారు. యూనిట్ల స్థాపనకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. మూడేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ఆదరణ కరవైంది.

మూడేళ్లుగా ముందుకు కదలక

* ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డొమెస్టిక్‌ మార్కెటింగ్‌ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2020లో యూనిట్లు మంజూరయ్యాయి. మొదట గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రూ.2 లక్షల యూనిట్‌ విలువతో పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రూ.10 లక్షల విలువ చేసే డెలీషియస్‌ రెస్టారెంట్లు, రూ.20 లక్షల విలువ చేసే సూపర్‌ రెస్టారెంట్లు, రూ.50 లక్షల లాంజ్‌ రెస్టారెంట్లు, రూ.కోటి వ్యయమయ్యే ఆక్వా హబ్‌లను మంజూరు చేశారు. వ్యాపారులు, లబ్ధిదారులు ఎవరూ ముందుకు రాలేదు.

* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫిష్‌ రిటైల్‌ ఔట్‌లెట్లు మంజూరై మూడేళ్లవుతోంది. ఇంత వరకు ఈ పథకానికి ఆశించిన స్పందన లేదు. నంద్యాల జిల్లాలో రూ.10 లక్షల యూనిట్‌కు సంబంధించి ఓ ఔత్సాహికుడు మాత్రమే ముందుకొచ్చారు. కర్నూలు జిల్లాలో రూ.10 లక్షల యూనిట్‌కు ఎనిమిది మంది, రూ.20 లక్షల యూనిట్‌కు ఆరుగురు, రూ.50 లక్షల యూనిట్‌కు ముగ్గురు దరఖాస్తు చేసుకోగా ఇవి ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నాయి.

* పథకం ప్రారంభంలో పెద్దగా రాయితీలు లేకపోవడంతో అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదు. తర్వాత రాయితీ సౌకర్యాలు కల్పించినా లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.


పూర్తి స్థాయిలో ప్రచారం  

శ్యామలమ్మ, మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌, కర్నూలు

గతంతో పోలిస్తే ప్రస్తుతం యూనిట్లు స్థాపించే లబ్ధిదారులకు ఎక్కువ రాయితీలు కల్పిస్తున్నాం. పథకం గురించి పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నాం. కర్నూలు జిల్లాలో గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య పెరిగింది. డీఆర్డీఏ, మెప్మా శాఖలతో కలిసి పనిచేస్తున్నాం. రైతులకు మేలు కలిగించే విధంగా చర్యలు ఉండనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని