logo

ఉగాది ఉషస్సు.. తెలుగింటి తేజస్సు

శోభకృత్‌ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో వెలుగొందాలి.. ఉగాది ఉషస్సు.. తెలుగింటి తేజస్సు అని జడ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ ఆకాంక్షించారు.

Published : 23 Mar 2023 02:06 IST

ఉగాది పురస్కారం అందుకున్న అర్చకులతో కలెక్టర్‌, జడ్పీ ఛైర్మన్‌

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే :  శోభకృత్‌ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో వెలుగొందాలి.. ఉగాది ఉషస్సు.. తెలుగింటి తేజస్సు అని జడ్పీ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ ఆకాంక్షించారు. కలెక్టరేట్‌లో దేవాదాయ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో బుధవారం శోభకృత్‌ నామ సంవత్సరం వేడుకలు  నిర్వహించారు. అంతకుముందు అర్చకులు కలెక్టర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సుధీంద్ర ఆచారి శాస్త్రోకంగా గణపతి పూజ నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం పంచాంగ శ్రవణం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అందరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందన్నారు. జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. దేవదాయ శాఖ ద్వారా అర్చకులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. కోటపాడు గ్రామ చెన్నకేశవస్వామి ఆలయ అర్చకులు శ్రీనివాసులు, నంద్యాల బ్రహ్మనందీశ్వరస్వామి ఆలయ అర్చకులు రాచకొండ మురళీకృష్ణశర్మ, నొస్సం బుగ్గ వెంకటేశ్వర రామలింగేశ్వర స్వామి ఆలయం అర్చకులు పెట్టినకోట శ్రీకాంత్‌శర్మకు రూ.10,116 పారితోషికం, ప్రశంసాపత్రం, కండువాలను జిల్లా కలెక్టర్‌, జడ్పీ ఛైర్మన్‌లు అందజేసి సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన వారికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, ప్రసాదాలు అందజేశారు. వేడుకలకు జిల్లా అధికారులు సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. డీఆర్వో పుల్లయ్య, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ సీహెచ్‌ శిరోమణి మద్దయ్య, దేవదాయ శాఖ ఏసీ సుధాకర్‌రెడ్డి, పర్యాటక శాఖ అధికారి సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డా.వెంకటరమణ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాబున్ని, కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, డీఎస్‌వో ఆచార్యులు, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని