logo

కరపత్రాలు పంపిణీ చేశారని దాడి

అక్రమాలు.. నిబంధనల ఉల్లంఘనలపై కరపత్రాలతో ప్రశ్నించినందుకు నిర్బంధించి దాడి చేశారు.. న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి లేఖ రూపంలో గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం కొరవడింది.

Published : 23 Mar 2023 02:06 IST

ఎస్పీకి ఫిర్యాదు చేసినా  స్పందన కరవు

ఈనాడు, కర్నూలు, నంద్యాల గ్రామీణం: అక్రమాలు.. నిబంధనల ఉల్లంఘనలపై కరపత్రాలతో ప్రశ్నించినందుకు నిర్బంధించి దాడి చేశారు.. న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి లేఖ రూపంలో గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం కొరవడింది.. చేసేది లేక మానవహక్కుల కమిషన్‌, లోకాయుక్త న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీజీపీకి లేఖలు పంపించినట్లు విజయ పాల డెయిరీలో పని చేస్తున్న కార్మికుడు గాలిపోతుల ఇసాక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తీరును ఆయన వివరించారు... నంద్యాల జిల్లా చాగలమర్రి మండలానికి చెందిన నేను విజయ పాల డెయిరీలో కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నా. 20 ఏళ్లుగా కనీస వేతనానికి నోచుకోకపోవడంతో తనలాంటి మరికొందరు బాధితులతో కలిసి కార్మిక సంఘం ఏర్పాటు చేశాం. యూనియన్‌ పెట్టిన 11 మంది కార్మికులను లోపలికి రాకుండా సంస్థ సెక్యూరిటీ సిబ్బంది గత సంవత్సరం సెప్టెంబరు ఎనిమిదో తేదీ నుంచి అడ్డుకుంటోంది. అధికారులు పట్టించుకోవడం లేదని రూపొందించిన కరపత్రాలు ఈనెల తొమ్మిదో తేదీన ఆళ్లగడ్డలో పంపిణీ చేస్తుండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు నిర్బంధించారు. నాతోపాటు ఆళ్లగడ్డకు వచ్చిన మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఫోన్‌ రావడంతో నన్ను వదిలేశారు. వారి చెర నుంచి బతికి బయటపడతాననుకోలేదు. తనపై దాడి జరిగింది.. చంపడానికి ప్రయత్నించారని.. ఈనెల పదో తేదీన ఎస్పీ రఘువీర్‌రెడ్డికి ఫిర్యాదు చేశామన్నారు. తామే ఇసాక్‌ను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపామని నంద్యాల పోలీసులు తెలిపారు. అతనిపై ఎలాంటి దాడి జరగలేదు.. ఎలాంటి కేసూ నమోదు చేయలేదని వివరించారు. కార్మికులు చేస్తున్న ఆరోపణలపై మాట్లాడడానికి ‘విజయ పాల డెయిరీ’ ఎండీ పరమేశ్వరరెడ్డికి ఫోన్‌ చేయగా స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని