logo

జీవనాడులు.. నిర్లక్ష్యపు జాడలు

Published : 24 Mar 2023 05:02 IST

కేటాయింపులకే పరిమితం

అధ్వానంగా సాగునీటి కాల్వలు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: కేసీ, తెలుగు గంగ, ఎస్సార్బీసీ ప్రధాన సాగునీటి వనరులు. జిల్లాలో 70 శాతం భూములకు నీరందించేవి ఈ కాల్వలే. ఉమ్మడి జిల్లాకు జీవనాడులైన వీటి బాగోగులకు తీసుకుంటున్న చర్యలు కాగితంపై కనిపిస్తున్నంతగా క్షేత్ర స్థాయిలో కానరావడం లేదు. బడ్జెట్‌లో విడుదలవుతున్న నిధులు ప్రధాన కాల్వల అభివృద్ధికి, జలాశయాల నిర్మాణాలకు పరిమితం చేస్తున్నారు, తప్పించి పంట కాల్వల మరమ్మతులపై దృష్టి సారించడం లేదు.  

కేటాయింపులకే పరిమితం

కేసీ, తెలుగు గంగ, ఎస్సార్బీసీలకు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. తెలుగు గంగకు కేటాయించిన నిధులు రూ.232 కోట్లను  నాలుగు జిల్లాల పరిధిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో మన జిల్లాకు ఎంతమేర కేటాయింపులున్నాయో ఏప్రిల్‌లో తిరుపతి సీఈ నిర్ణయించనున్నారు. ప్రస్తుత బడ్జెట్‌ నిధుల్లో కొంతమేర జిల్లాకు కేటాయింపులున్నా ప్రధాన కాల్వల లైనింగ్‌ పనులకే పరిమితం చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీ రూ.225.22 కోట్ల మొత్తం రాజోలి-జొళదరాశి పనులకే పరిమితం చేయనున్నారు. ఇక ఎస్సార్బీసీకి కేటాయించిన రూ.42 కోట్లు నిధులన్నీ గతంలో చేసిన పనుల చెల్లింపులకే సరిపోతుంది.  

ఉపాధి హామీ పథకమే గతి

జిల్లాలోని మూడు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు పంట కాల్వల అభివృద్ధికి ఏమాత్రం సరిపోకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద కాల్వల పూడికతీత పనులు మాత్రమే చేస్తున్నారు. ప్రతి ఏటా జిల్లాలో జరిగే పనుల్లో 60 శాతం పంట కాల్వలు, చెరువుల పూడికతీత పనులే ఉంటున్నాయి. ఈ ఏడాది ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఒప్పందం కష్టాలు

రుద్రవరం సమీపంలోని తెలుగు గంగ బ్లాక్‌ ఛానల్‌. కాల్వలకు లైనింగ్‌ లేదు. తరచూ గండ్లు పడుతూ నీళ్లు వృథా కావడంతోపాటు, పంట పొలాలను నష్టానికి గురిచేస్తుంటాయి. నిర్మించి 15 ఏళ్లవుతున్నా ఎలాంటి మరమ్మతులు లేవు. కనీసం ముళ్ల చెట్లను తొలగించేందుకు నిధులు ఖర్చు చేసిన దాఖలాలు లేవు. 2008లో దాదాపు రూ.8 కోట్లతో కాల్వలను పూర్తి చేసేందుకు నిధులు మంజూరయ్యాయి. గుత్తేదారు పనులను అసంపూర్తిగానే వదిలేశారు. ఒప్పందాన్ని రద్దు చేయకపోవడంతో సాంకేతికంగా కొత్త టెండర్‌ పిలిచేందుకు వీల్లేకుండా పోయింది.  పంట కాల్వలు పూర్తి కాక రైతులు తెలుగు గంగ నీటి కోసం ఎదురుచూస్తున్నారు.


గతంలో చేసిన పనులకే సరి : సుబ్బరాయుడు, ఈఈ, ఎస్సార్బీసీ

ఎస్సార్బీసీ కింద గతంలో చేసిన పనులకు రూ.42 కోట్లు బిల్లులు బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రస్తుత బడ్జెట్‌లో విడుదలైంది. కొత్త పనులకు అంచనాలు రూపొందించి అనుమతుల కోసం ఉన్నతాధికారులకు పంపించాం. నిధులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.


ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరు వద్ద అసంపూర్తిగా ఉన్న ఎస్సార్బీసీ పంట కాల్వ. చెంతనే నీళ్లున్నా, నిధుల్లేక పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. ఈ ప్రాంతంలో బోర్లు వేసినా ఉప్పు నీరు వస్తుండటంతో సారవంతమైన భూములున్నా కేవలం వర్షాధార పంటలే సాగు చేయక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని