logo

చేతులు కలిపి.. చెరువుకు ఆయువు పోసి

నంద్యాల జిల్లా శిరివెళ్లలోని నాగుల చెరువుకు సాగునీరు అందించే కాలువ పూడికతో నిండిపోవడంతో క్రమంగా అటు ప్రవాహం, ఇటు సామర్థ్యం తగ్గుతోంది

Published : 24 Mar 2023 05:11 IST

రూ.2 లక్షలతో కాల్వకు పూడికతీత పనులు
- న్యూస్‌టుడే, శిరివెళ్ల

కాలువలో పూడికను తొలగిస్తున్న జేసీబీ యంత్రం

నంద్యాల జిల్లా శిరివెళ్లలోని నాగుల చెరువుకు సాగునీరు అందించే కాలువ పూడికతో నిండిపోవడంతో క్రమంగా అటు ప్రవాహం, ఇటు సామర్థ్యం తగ్గుతోంది. దీంతో ఆయకట్టు రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు చందాలు వేసుకుని జేసీబీ యంత్రంతో కాలువలోని అపరిశుభ్రత, ముళ్ల పొదలు, గుర్రపు డెక్కల తొలగింపు పనులు చేపట్టారు. గ్రామంలో నాగుల చెరువు సుమారు 200 ఎకరాల వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో సుమారు 900 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువుకు కింద ప్రతి ఏటా ఖరీఫ్‌, రబీలో సుమారు 500 మంది ఆయకట్టు రైతులు వరిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చెరువుకు సాగునీరందించే కాలువ పూడికతో నిండిపోవడంతో ఆయకట్టు కింద వరిని సాగు చేస్తున్న రైతులు తమ పంటను కాపాడుకొనేందుకు యుద్ధ ప్రాతిపాదికన చందాలు పోగు చేసుకుని ఆ డబ్బులతో జేసీబీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకుని ఐదు రోజులుగా పూడికతీత పనులను చేపట్టారు.


పంటలు కాపాడుకోవాలని..  
- దస్తగిరి, ఆయకట్టు రైతు

నేను గ్రామంలోని నాగుల చెరువు కింద 30 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. చెరువు పూడికతో నిండిపోవడంతో నీటి ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండటంతో సాగునీరు అందించేందుకు పూడికతీతపై ఆయకట్టు రైతులందరం మాట్లాడుకున్నాం. చందాలు పోగు చేసి జేసీబీతో పనులు చేపట్టాం. మైనర్‌ ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి చివరి ఆయకట్టు పొలాలకు నీరందించాలి.


ఐదేళ్ల క్రితం సైతం రూ.1.50 లక్షలతో...

శిరివెళ్ల మండలంలోని ఇసుకపల్లె గ్రామ వాగు నుంచి 5 కి.మీ. మేర కాలువ గుండా తెలుగు గంగ నీరు నాగుల చెరువుకు చేరుకుంటుంది. 10 ఏళ్ల క్రితం ఇసుకపల్లె వాగు వద్ద చెక్‌డ్యాంను ఏర్పాటు చేసి దాని ద్వారా చెరువుకు వివిధ శాఖలు, పలువురు ప్రజాప్రతినిధుల సహకారంతో సాగునీరందించారు. దాని తర్వాత ఇప్పటి వరకు కాలువలోని పూడికతీత పనులు చేపట్టలేదు. గతంలో (5 ఏళ్ల క్రితం) కూడా ఆయకట్టు రైతులు సుమారు రూ.1.50 లక్షల సొంత ఖర్చుతో పనులు చేపట్టి పంటలను కాపాడుకున్నారు. ఇప్పటికి 5 ఏళ్లు కావొస్తున్నా విషయాన్ని ఆయకట్టు రైతులు సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధుల దృష్టికి పూడికతీత విషయాన్ని తీసుకెళ్లినా పట్టించుకునేవారు కరవయ్యారు. దీంతో చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి రైతులు రూ.2 లక్షలు వరకు చందాలు వేసుకుని పూడికతీత పనులు చేపట్టడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు నాగుల చెరువు పూడికతీత, అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు