logo

తడారిన గడప.. గడప పనులు

సారూ.. మా కాలనీకి బిందెడు నీరు రావడం లేదు.. పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో మంచినీరు లీకేజీ అవుతోంది.. కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది.. ఏళ్లుగా మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాం.. సమస్య పరిష్కరించాలని గడప.. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలకు స్థానికులు విన్నవించారు.

Published : 25 Mar 2023 01:47 IST

సారూ.. మా కాలనీకి బిందెడు నీరు రావడం లేదు.. పైపులైన్లు శిథిలావస్థకు చేరడంతో మంచినీరు లీకేజీ అవుతోంది.. కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది.. ఏళ్లుగా మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాం.. సమస్య పరిష్కరించాలని గడప.. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలకు స్థానికులు విన్నవించారు. ఇదిగో పరిష్కరిస్తామని గడపలోనే ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నాయి.. తట్టెడు మట్టి పని జరగలేదు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 362 పనులకు ఆమోదం వస్తే 39 పనులే పూర్తవడం గమనార్హం.


పెద్దపాడులో పెద్ద కష్టం

కల్లూరు పట్టణం పెద్దపాడులో స్థానికులు తాగునీటి ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 16, 17, 18 తేదీల్లో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పెద్దపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు ఎమ్మెల్యేకు తాగునీటి సమస్యను విన్నవించారు.స్పందించిన ఆయన నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయించారు. ట్యాంకర్లూ సకాలంలో రాకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ


సంక్రాంతి పోయింది.. ఉగాది దాటింది

హరిజనవాడలో ఎమ్మెల్యే శిల్పాకు సమస్య విన్నవిస్తున్న మహిళ (పాతచిత్రం)

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డికి నంద్యాల ప్రజలు నీటి ఎద్దడిని విన్నవించారు. సంక్రాంతి నాటికి పట్టణంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉగాది దాటినా సరే సరిపడా నీరు ఇవ్వకపోగా సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయిందని దేవనగర్‌, జగజ్జననినగర్‌, నడిగడ్డ, హరిజనవాడ, పీవీ నగర్‌, మూలసాగరం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ సంక్రాంతి నాటికి మంచినీటి సమస్య పరిష్కరిస్తామన్నారు... ఇప్పటి వరకు కదలికలేదని’’ ఒకటో వార్డుకు చెందిన నాగన్న వాపోయారు.

న్యూస్‌టుడే, నంద్యాల పురపాలకం


ఎనిమిది నెలలు.. అందని జలం

మంత్రి జయరాంను నిలదీస్తున్న మహిళలు (పాతచిత్రం)

ఆస్పరి మండలంలోని కైరుప్పలలో గతేడాది జులైలో మంత్రి జయరాం పర్యటించారు. బీసీ కాలనీలో మహిళలు ఖాళీ బిందెలతో మంత్రి ఎదుట నిరసన తెలిపారు. 20 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని మంత్రి జయరాం వారికి హామీ ఇచ్చారు. ఎనిమిది నెలలు కావొస్తున్నా.. నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. బీసీ కాలనీలో బోర్లు కానీ, మినీ ట్యాంకులు లేవు.  మురుగు కాల్వ దాటి పక్కనే ఉన్న ఎస్సీ కాలనీలో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  - న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణం


మంచినీటి ఎద్దడిని తీర్చాలని ఎమ్మెల్యే సుధాకర్‌కు విన్నవిస్తున్న ప్రజలు (పాతచిత్రం)

గూడూరు నగర పంచాయతీ పరిధిలోని కాలనీల్లో ఎమ్మెల్యే డా.సుధాకర్‌ 21 జనవరి 2023న పర్యటించారు. తమ కాలనీకి మంచినీరు సరఫరా కావడం లేదని కొత్తగేరి వాసులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇప్పటికీ సమస్య వెంటాడుతోంది.. ఆస్తి, నీటి పన్నును ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.. బిందెడు నీళ్లు ఇవ్వడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు.

న్యూస్‌టుడే, గూడూరు


బురుజుల దాహం తీరలేదు

ఎమ్మెల్యే శ్రీదేవిని ప్రశ్నిస్తున్న మహిళ (పాతచిత్రం)

మద్దికెర మండలం బురుజులలో గత అక్టోబరు 23, 24వ తేదీల్లో రెండ్రోజుల పాటు ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటించారు. మంచినీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు విన్నవించారు. అందుకు ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.. సమీప గ్రామాలకు వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

న్యూస్‌టుడే, మద్దికెర


పైపులు పడేశారు

మదిరెలో పైప్‌లైన్‌ ఏర్పాటుకు సిద్ధంగా పైపులు

కౌతాళం మండలం మదిరెలో 25 ఆగస్టు 2023న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పర్యటించారు. నీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.. వెంటనే సమస్య పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. మూడు నెలల కిందట పైపులు తీసుకొచ్చి గ్రామంలో పడేశారు. పనులు ప్రారంభించలేదు.

న్యూస్‌టుడే, కౌతాళం


చిన్నపెండేకల్‌.. ఆగని కన్నీళ్లు

ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి విన్నవిస్తున్న జనం (పాతచిత్రం)

ఆదోని మండలం చిన్నపెండేకల్‌లో 10 జూన్‌ 2022న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పర్యటించారు. మంచినీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం.. సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. జల్‌జీవన్‌ మిషన్‌ పథకం కింద ఉగాది వరకు మంచినీరు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు పూర్తికాలేదు

న్యూస్‌టుడే, ఆదోని గ్రామీణం


ఇప్పటి వరకు 39 పూర్తి

* కర్నూలు జిల్లాలో 163 పనులకు ప్రతిపాదనలు పంపించగా 159 పనులకు కలెక్టర్‌ ఆమోదం తెలిపారు. కేవలం ఒక్క పథకం పూర్తి అయ్యింది.. భౌతికంగా 37 పూర్తయ్యాయని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నారు.

* నంద్యాల జిల్లాలో రూ.7.35 కోట్లతో 199 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 38 పూర్తవ్వగా.. 131 పురోగతిలో ఉన్నాయి.. 30 ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం చేసిన పనుల వివరాలు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసినా నిధులు విడుదల కావడం లేదు.


అధికారుల నీటిమాటలు

ఆలూరు: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గంలో రూ.2.51 కోట్లతో 58 మంచినీటి పథకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 10 పూర్తి అయ్యాయి.

* కోడుమూరు: సి.బెళగల్‌, కోడుమూరు, గూడూరు, కర్నూలు మండలాల్లో 41 తాగునీటి పనులకు రూ.1.35 కోట్లు కేటాయించారు. గూడూరు మండలంలో ఒక్కటి పూర్తైంది.

* ఆదోని:  రూ.45 లక్షలతో 17 పనులు చేపట్టగా ఐదు పూర్తయ్యాయి. 12 పురోగతిలో ఉన్నాయి.

* మంత్రాలయం: కోసిగి, మంత్రాలయం, పెద్దకడబూరు మండలాల్లో రూ.1.11 కోట్లతో 32 పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందులో 10 పూర్తి చేయగా 21 వివిధ దశలో ఉన్నాయి. కోసిగి మండలంలో ఒకటి టెండరు దశలో ఉంది.

* పాణ్యం: ఓర్వకల్లులో రూ.32 లక్షలతో ఐదు పనులు, కల్లూరులో రూ.20 లక్షలతో నాలుగు పనులు చేపట్టారు.

* పత్తికొండ: నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రూ.45 లక్షలతో 9 పనులు చేపట్టాలని నిర్ణయించారు. మద్దికెర మండలంలో రూ.3 లక్షలతో చేపట్టిన పని మాత్రమే పూర్తయ్యింది.

* ఎమ్మిగనూరు: నియోజకవర్గానికి ఒక్క పని మంజూరు కాలేదు.

న్యూస్‌టుడే,   కర్నూలు సచివాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని