logo

బకాయిలు విడుదల చేయాలని నినదించిన ఉద్యోగులు

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ఏపీ ఐకాస అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి అన్నారు.

Published : 25 Mar 2023 01:47 IST

సునయన ఆడిటోరియం వద్ద నిరసన తెలుపుతున్న ఏపీ ఐకాస అమరావతి

జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ఏపీ ఐకాస అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం 9.30కు రీసర్వే శిక్షణకు రావాలని తహసీల్దార్లు, సర్వే డీటీలు, సర్వేయర్లు, వీఆర్వోలు, విలేజ్‌ సర్వేయర్లను అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారిని శిక్షణ కార్యక్రమానికి ముందస్తుగా వెళ్లనీయకుండా ఏపీ ఐకాస అమరావతి నాయకులు అడ్డుకున్నారు. వర్క్‌ టు రూల్‌ ప్రకారం పనిచేయాలని నినదించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ డీఏలు, పీఆర్‌సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, కొత్త పీఆర్‌సీ ప్రకటించాలన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు ఉద్యమ పోరాటం ఆగదన్నారు. కలెక్టరేట్‌లోని వివిధ కార్యాలయాల్లో సాయంత్రం ఐదు గంటల తర్వాత పనిచేస్తున్న ఉద్యోగులను బయటకు పంపి తాళం వేయించారు. ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డిని కలిసి ఆయనకు నల్లబ్యాడ్జీ  పెట్టి నిరసనలో పాల్గొనాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకం కావాలన్నారు. ఈ నిరసనలో ఏపీ ఐకాస అమరావతి జిల్లా నాయకులు నాగ రమణయ్య, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మద్దిలేటి, వీఆర్వోల సంఘం నాయకులు సూరిబాబు, మద్దిలేటి, స్వామన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని