logo

అమృత్‌ ఘడియ ముగుస్తోంది

కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఎస్సీ రైతు ట్రాక్టర్‌ కొనుగోలు చేశారు. రాయితీ కోసం జిల్లా పరిశ్రమల శాఖలో రెండేళ్ల కిందట దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు రాయితీ అందలేదు.

Published : 25 Mar 2023 01:47 IST

రుణాల దరఖాస్తుకు మూడు రోజులే గడువు
అవగాహన కల్పించని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు

 

సంక్షేమ భవన్‌లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం

న్యూస్‌టుడే-కర్నూలు సచివాలయం, కర్నూలు సంక్షేమ శాఖ: కల్లూరు మండలం తడకనపల్లెకు చెందిన ఎస్సీ రైతు ట్రాక్టర్‌ కొనుగోలు చేశారు. రాయితీ కోసం జిల్లా పరిశ్రమల శాఖలో రెండేళ్ల కిందట దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు రాయితీ అందలేదు.

ఓర్వకల్లు మండల కేంద్రంలో ఓ ఎస్సీ రైతు తన పొలంలో బోరు వేయించుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. నాలుగేళ్లుగా పథకం లేదని అధికారులు చెబుతున్నారు. ఆ రైతు నిత్యం వెనుదిరిగి పోతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ప్రారంభించినట్లు తెలుసుకుని సదరు రైతు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులను కలిశారు. మూడు రోజులే గడువు ఉందని.. వెబ్‌సైట్‌ పనిచేయడం లేదని చెప్పడంతో ఆయన వెనుదిరిగారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎస్సీ రైతులు, నిరుద్యోగులకు రెండేళ్లుగా రాయితీలు అందడం లేదు.. ఎస్సీ కార్పొరేషన్‌లో నాలుగేళ్లుగా పథకాలు లేవు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. వీటిపై ఏమాత్రం అవగాహన కల్పించలేదు. ప్రస్తుతం మూడు రోజుట్లో గడువు ముగియనున్నా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేక పోయారు. వెబ్‌సైట్‌ పనిచేయక కొందరు.. అవగాహన లేమితో మరికొందరు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరిందరు.. ఇలా పథకాలకు దూరమవుతున్నారు.

అధికారుల  నిర్లక్ష్యం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమృత్‌ జలధార, యంగ్‌ ఎంటర్‌ప్రైన్యూర్‌ అనే రెండు పథకాలను ఇటీవల ప్రవేశపెట్టింది. దళిత రైతులు, నిరుద్యోగులు జీవితంలో నిలదొక్కుకునేలా రూ.50 వేల నుంచి రూ.60 వేల రాయితీతో రుణాలిచ్చేందుకు ముందుకొచ్చింది. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే ఇప్పుడు సమస్యగా మారింది. ఈనెల మొదటి వారంలోనే పథకాలు అందుబాటులోకి వచ్చినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ పేరుతో అధికారులు వివరాలు వెల్లడించలేదు. రెండు రోజుల కిందట ఈ పథకాల గురించి జిల్లా అధికారులు సమావేశమయ్యారు. 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటేనే అర్హులని ప్రకటించారు. నాలుగేళ్ల తర్వాత రాయితీ రుణాలిస్తున్నారని ఆశ పడినప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు అమృత కాలం దాటిపోతుండటంతో రైతులు, నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

కేంద్రం  అందుబాటులోకి తెచ్చినా..

అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ జలసిరి పథకం పేరుతో బోర్లు తవ్వి.. సౌర విద్యుత్తుతో మోటార్లు అందించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని వైఎస్‌ఆర్‌ జలకళగా మార్చి అమల్లోకి తెచ్చారు. ఈ నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందలేదు. బోరు వేస్తే విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వరు.. విద్యుత్తు కనెక్షన్‌ ఇస్తే మోటార్లు ఇవ్వరు.. ఫలితంగా ఏ రైతు జలకళ ద్వారా పంటకు నీరు పెట్టుకోలేకపోయారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమృత్‌ జలధార పథకం ద్వారా ఎస్సీ రైతులకు రూ.లక్ష రుణంతో బోరు వేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అందులో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.50 వేలు రాయితీ కాగా.. మిగతా రూ.50 వేలు బ్యాంకు రుణంగా ఇప్పించనున్నారు. కనీసం 2.50 ఎకరాలున్న రైతులే అర్హులు. వైఎస్‌ఆర్‌ జలకళతో విసిగిపోయిన రైతులకు అమృత్‌ జలధార కొంత ఊరడింపుగానే ఉంది. ఈ పథకం గురించి దరఖాస్తు చేసుకోవాలంటూ ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ఇప్పటివరకు ప్రకటన కూడా జారీ చేయలేదు. ప్రస్తుతం ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు పెట్టడం రైతులను కలవరపెడుతోంది.

నిరుద్యోగులకు  అండగా..

ఆటోలు, ట్రాక్టర్లు, కిరాణా దుకాణాలు, ఫొటో స్టూడియో, టెంట్‌ హౌస్‌, మెడికల్‌ క్లినికల్‌ ల్యాబ్‌, ఫ్యాన్సీ దుకాణం వంటి వాటితో నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా రూ.3 లక్షల వరకు బ్యాంకు రుణం ఇవ్వనున్నారు. ఇందులో రూ.60 వేల రాయితీ సదుపాయం కల్పించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 27నే చివరి గడువు.  

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 లక్షల మందికిపైగా 18 ఏళ్ల నుంచి 48 ఏళ్లకు పైబడిన ఎస్సీ సామాజిక వర్గం ఉంది. వీరందరూ కేంద్ర ప్రభుత్వ పథకాలైన అమృత్‌ జలధార, యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ పథకాలకు అర్హులే..

సచివాలయాల్లో  దరఖాస్తు చేసుకోవాలి

అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుందని అధికారులు చెబుతున్నారు. సచివాలయాల్లో ఒబీఎంఎంఎస్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే ఆ వెబ్‌సైట్‌ ఓపన్‌ కావడం లేదని ఎస్సీ రైతులు, నిరుద్యోగులు పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పథకాల గురించి అడిగేందుకు వెళ్తే తమకేమి తెలియదని చెబుతున్నారని పలువురు పేర్కొన్నారు.

పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్‌, కులధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా నంబరు వంటి వివరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మూడు రోజులే గడువు ఉండటంతో అమృత్‌ జలధారను అందుకోవడం కష్టమేనని పలువురు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని