logo

పసుపు కొనని ప్రభుత్వం

పసుపు పంటను కొనేవారు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి  ఎదురుచూస్తున్నారు.

Published : 25 Mar 2023 01:47 IST

మహానందిలో పసుపును వండుతున్న రైతులు

మహానంది, పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే:  పసుపు పంటను కొనేవారు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి  ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 700 హెక్టార్లలో పంట సాగైంది. మహానంది మండలంలో 218 హెక్టార్లు, చాగలమర్రి 150, రుద్రవరం 105, నంద్యాల 54, పాములపాడు 48, ఆళ్లగడ్డ 18, కొలిమిగుండ్ల 23, పాణ్యం 10, శిరివెళ్ల మండలాల్లో 15 హెక్టార్లలో సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంతో ఈ ఏడాది పంట దిగుబడి భారీగా తగ్గింది. ఎకరాకు 35 నుంచి 30 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. 10 నుంచి 20 క్వింటాళ్ల వరకు వచ్చింది. పసుపు తవ్వి ఉడకబెట్టి ఆరబోశారు.

అనుమతులు రాలేదంటున్న అధికారులు

క్వింటా రూ.6,800 మద్దతు ధర చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొనుగోళ్ల ఆనవాళ్లు కనిపించడం లేదు.  ‘‘ ఈ ఏడాది పసుపు కొనుగోలుకు అనుమతులు రాలేదు. గతేడాది మే నెలలో కొనుగోలు చేసిన 1,100 టన్నుల పసుపు సెంట్రల్‌ వేర్‌ హౌస్‌లో నిల్వ ఉంచినట్లు’’ మార్క్‌ఫెడ్‌ నంద్యాల జిల్లా మేనేజర్‌ నాగరాజు తెలిపారు.


 లక్షలు పెట్టుబడి పెట్టా

చంద్రనాయక్‌, గోరుకల్లుతండా, పాణ్యం

నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పసుపు సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 20 క్వింటాళ్లు మించి దిగుబడి రాలేదు. వచ్చిన పంటను అమ్ముకుందామని చూసినా ఎవరూ రావడం లేదు. ఇతర ప్రాంతాల్లోని మార్కెట్‌లో ధరలు తెలుసుకున్నాం. క్వింటా రూ.5 వేల నుంచి రూ.5,500 పలుకుతోందని సమాచారం. కష్టపడి అంతదూరం తీసుకెళ్తే ఏమాత్రం గిట్టుబాటు కాదు.


క్వింటాకు రూ.8 వేలు ఇవ్వాలి

ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, తమడపల్లె, మహానంది

నాలుగు ఎకరాల్లో పసుపు సాగు చేశా. ఎకరాకు రూ.20-25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. బయట మార్కెట్లో ధర లేదు.. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. క్వింటాకు రూ.8 వేలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది. ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందోనని ఎదురుచూస్తున్నాం.


విత్తన రకాలు మార్చాలి

శ్రీధర్‌, ఉద్యానశాఖాధికారి, నంద్యాల

మన ప్రాంతంలో పండించే పసుపు లో నాణ్యత లేదని ఇతర దేశాలు దిగుమతి చేసుకోవడం లేదు. ప్రస్తుతం మైదుకూరు సుగంధం రకాన్ని పండిస్తున్నారు. ఇందులో కుర్కుమిన్‌ శాతం తక్కువగా ఉంటుంది. స్థానిక మార్కెట్‌కు సరిపోతాయి. ఇప్పటికైనా రైతులు సేలం, బీఎస్‌ఆర్‌-2 రోమా రకాలు సాగు చేసుకుంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని