logo

ప్రాధాన్యం తగ్గింది

కల్లూరు మండలం తడకనపల్లెకు రెండేళ్ల కిందట రైతు భరోసా కేంద్రం మంజూరైంది. స్థల సమస్యతో ఏడాది గడిచింది.

Published : 27 Mar 2023 03:07 IST

ఏళ్లుగా సాగుతున్న భవన నిర్మాణాలు
భారీగా పేరుకుపోయిన బిల్లులు
న్యూస్‌టుడే-కర్నూలు సచివాలయం

గడివేములలో అసంపూర్తిగా సచివాలయ భవనం

కల్లూరు మండలం తడకనపల్లెకు రెండేళ్ల కిందట రైతు భరోసా కేంద్రం మంజూరైంది. స్థల సమస్యతో ఏడాది గడిచింది. ఎట్టకేలకు ఆరు నెలల కిందట స్థలం సమస్య పరిష్కారమైంది. బేస్‌మెంట్‌ వద్దే భవన నిర్మాణం ఆగిపోయింది.. ఇక్కడ ఆర్బీకే ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అయోమయ పరిస్థితి.  

గడివేముల మండలంలో 16 పంచాయతీలకుగాను 14 సచివాలయాలు ఉండగా గని సచివాలయం ఒక్కటి మాత్రమే వినియోగంలోకి వచ్చింది. 14 రైతు భరోసా కేంద్రాలకు ఒక్క కరిమద్దెల ఆర్‌బీకే వినియోగంలోకి వచ్చింది. చిందుకూరులో ఆర్బీకే నిర్మాణం మొదలు కాలేదు. మిగిలిన గ్రామాల్లో సచివాలయాలు, ఆర్‌బీకేల నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. బిలకలగూడూరు, కొరటమద్ది, గడిగరేవుల సచివాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి.

2020-21 ఏడాదిలో గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, బల్క్‌మిల్క్‌, చెత్త సంపద తదితర కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3,393 భవనాలు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 570 భవనాలు మాత్రమే పూర్తయినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, నిర్మాణ వ్యయం పెరగడం తదితర కారణాలతో పనులు ముందుకు కదలడం లేదు.

* ఉమ్మడి జిల్లాలో రూ.332.85 కోట్లతో గ్రామ సచివాలయాల నిర్మాణాలు చేపడితే ఇప్పటివరకు సగం పూర్తి కాని పరిస్థితి.

165 ఆర్‌బీకేలు పూర్తి

రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేందుకు గ్రామాల్లో రూ.184.68 కోట్ల అంచనాలతో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు చేపట్టారు. గడిచిన రెండేళ్లల్లో ఇప్పటి వరకు 165 మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణాలు ఆలస్యం కావడంతో అద్దె భవనాల్లో ఆర్బీకేల నిర్వహణ భారంగా మారింది. సకాలంలో అద్దెలు చెల్లించడం లేదని భవన యజమానులు కేంద్రాలకు తాళాలు వేసిన ఘటనలు లేకపోలేదు.

* వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణాలను రూ.104.68 కోట్లతో చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 52 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి.

* గ్రామంలో పేద మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో బల్క్‌ మిల్క్‌ కేంద్ర భవన నిర్మాణాలు చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.45.76 కోట్లతో బల్క్‌ మిల్క్‌ కేంద్రాల నిర్మాణాలు చేపడుతుండగా.. ఇప్పటి వరకు మూడు మాత్రమే పూర్తవడం గమనార్హం.

* గ్రామీణ ప్రాంతాల్లో రూ.50.88 కోట్లతో డిజిటల్‌ గ్రంథాలయాల పనులు చేపట్టగా ఒక్కటీ పూర్తి కాలేదు. కర్నూలులో 92, నంద్యాలలో 18 భవనాలు పురోగతిలో ఉన్నాయి. ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ (చెత్త నుంచి సంపద) కేంద్రాలు 336 మంజూరు చేయగా.. ఇప్పటి వరకు కేవలం 32 మాత్రమే పూర్తయ్యాయి.

నిత్యం సమీక్షిస్తున్నా..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. అధికారులు నిత్యం సమీక్షిస్తున్నా ప్రయోజనం అంతంతమాత్రంగానే ఉంది. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామస్థాయిలో వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనేది దీని ఉద్దేశం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వీటిని ప్రాధాన్య కేటగిరీల్లో చేర్చారు. కాంపోనెంట్‌ నిధుల్లో ఎక్కువ భాగం భవనాలకే కేటాయించారు. ఈనెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

బిల్లుల మంజూరులో నిర్లక్ష్యం

* ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.50 కోట్లకుపైగా బిల్లులు మంజూరు కాక నిర్మాణాలు  అస్తవ్యస్తంగా ఉన్నాయి. బిల్లులు చెల్లింపులు చేస్తారో? లేదో? అన్న అనుమానాలతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. కోట్లాది రూపాయలతో చేపడుతున్న ప్రాధాన్య భవన నిర్మాణాలకు సంబంధించి ఎఫ్‌టీఓలు (ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్స్‌) పెండింగ్‌లో ఉన్నాయి.

* ఒక్క కర్నూలు జిల్లాలోనే రూ.45 కోట్ల మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో కేవలం 5 రోజుల వ్యవధిలో భవనాల నిర్మాణాలు చేపట్టడం సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నంద్యాల జిల్లాలో రూ.40 కోట్లకు పైగా కాంపోనెంట్‌ నిధులను వెచ్చించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని