logo

మదిలో సంకల్పం.. మైదానంలో సాధన

నిత్యం పుస్తకాలతో కుస్తీ పడి పోలీసులో శాఖ ఉద్యోగం కోసం ఇటీవల నిర్వహించిన ప్రీలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.

Published : 27 Mar 2023 03:07 IST

పోలీసు ఉద్యోగాలపై యువత గురి 
దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతూ..

ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో పరుగులు తీస్తున్న యువకులు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: నిత్యం పుస్తకాలతో కుస్తీ పడి పోలీసులో శాఖ ఉద్యోగం కోసం ఇటీవల నిర్వహించిన ప్రీలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. కీలక ఘట్టమైన దేహదారుఢ్య పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఆదోని పట్టణంలోని ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పట్టణానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు ముజాహిద్దిన్‌ ఉచితంగా శిక్షణ ఇస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఐదు గంటల పాటు వారి ప్రతిభకు పదునుపెడుతున్నారు.

* పోలీసు శాఖ దేహదారుఢ్య పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే అభ్యర్థులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చలాకీగా ఉండాలి. ఈ పోటీల్లో 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్‌, ఎత్తు, చెస్ట్‌ వంటి పరీక్షల్లో నెగ్గాల్సి వస్తోంది. ఇందుకు సంబంధించి కోచ్‌ సూచనలతో అభ్యర్థులు ప్రణాళిక బద్ధంగా సాధన చేస్తున్నారు.


సైన్యంలో  చేరాలని..

కోడుమూరుకు చెందిన రైతు దంపతులు భూషణ్న కుమారుడు వెంకటేశ్‌ డిగ్రీ చదివాడు. సైన్యంలో చేరాలని పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు. కాలు విరిగిపోవడంతో మెడికల్‌ ఫిట్‌నెస్‌ సాధించలేక వెనుదిరిగి వచ్చాడు. ప్రజలకు సేవ అందించాలన్న లక్ష్యంతో పోలీసు శాఖలో చేరి ఆ కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు వెంకటేశ్‌. అందుకు తగ్గట్టుగానే ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. దేహదారుఢ్య పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు వెంకటేశ్‌.


శ్రమిస్తేనే  ఫలితం

ఆదోని పట్టణానికి చెందిన లక్ష్మన్న, వెంకటేశ్‌ దంపతుల కుమారుడు భీమేశ్‌ ఆదోని ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ చదివాడు. తాను పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇందులో భాగంగా కానిస్టేబుల్‌, ఎస్‌ఎస్‌సీ జనరల్‌ డ్యూటీ విభాగంలో ప్రీలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించా. త్వరలో జరగనున్న దేహదారుఢ్య పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. రోజూ ఉదయం, సాయంత్రం ఐదు గంటలు  సాధన చేస్తున్నాడు. కష్టానికి ఫలితం లభిస్తుందన్న నమ్మకంతో తనకుందని భీమేశ్‌ చెబుతున్నాడు.


గ్రూప్సు కోసం శిక్షణ

ఆదోని పట్టణానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ అక్బర్‌బాషా, సాబీరా దంపతుల కుమారుడు ఎస్‌.పి.అబ్దుల్‌సత్తార్‌ అనే యువకుడు ఓ వైపు గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమవుతూనే.. మరోవైపు ఇటీవల జరిగిన పోలీసు కానిస్టేబుల్‌ ప్రీలిమినరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు. దీంతో ఆదోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. మెలకువలు నేర్చుకుంటున్నాడు. పోటీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు సత్తార్‌.


ఉద్యోగం చేస్తూనే..

నందవరం మండలం హనుమాపురానికి చెందిన హనుమంతు బి-ఫార్మసీ పూర్తి చేశాడు. ఆదోని పట్టణంలోని ఓ మెడికల్‌ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసు శాఖలో చేరి ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు అనుగుణంగానే కష్టపడి చదవి ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. దేహదారుఢ్య పోటీ పరీక్షలకు సైతం సన్నద్ధమవుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని