logo

ఒక్కడివి ఏం చేయగలవు

నందికొట్కూరు పురపాలక సమావేశంలో తెదేపా కౌన్సిలర్‌ భాస్కరరెడ్డిని ఛైర్మన్‌ దాసి సుధాకరరెడ్డి, వైకాపా కౌన్సిలర్లు తీవ్రంగా అవమానించారు.

Published : 30 Mar 2023 02:43 IST

సమస్యలపై నిలదీసిన తెదేపా కౌన్సిలర్‌పై ఛైర్మన్‌ అనుచిత వ్యాఖ్య

వాదులాడుకుంటున్న వైకాపా ఛైర్మన్‌, కౌన్సిలర్లు, తెదేపా కౌన్సిలర్‌

నందికొట్కూరు, న్యూస్‌టుడే : నందికొట్కూరు పురపాలక సమావేశంలో తెదేపా కౌన్సిలర్‌ భాస్కరరెడ్డిని ఛైర్మన్‌ దాసి సుధాకరరెడ్డి, వైకాపా కౌన్సిలర్లు తీవ్రంగా అవమానించారు. స్థానిక జైకిసాన్‌ పార్కులో బుధవారం పురపాలక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో 29వ వార్డు కౌన్సిలర్‌ భాస్కరరెడ్డి రజకులకు దుస్తులు శుభ్రం చేసేందుకు నీరు లేదని, బిజినవేముల సమీపంలో ఉన్న దోబీఘాట్‌ వద్ద బోరు వేసి నీటి సదుపాయం కల్పించాలని అడిగాడు. బోరు విషయమై కొంతసేపు ఛైర్మన్‌, భాస్కరరెడ్డి మధ్య చర్చ జరిగింది. సమస్యను పరిష్కరించాలని భాస్కరరెడ్డి పట్టుపట్టారు. దీంతో అసహనానికి గురైన ఛైర్మన్‌ ‘కౌన్సిల్‌లో నీవ్వో ఏకలింగానివి. కూర్చో. సమస్య ఎవరి పరిధిలోకి వస్తుందో వారితో మాట్లాడతాను’ అన్నారు. మనస్తాపానికి గురైన తెదేపా కౌన్సిలర్‌ ఆ మాట ఎలా అంటారని ప్రశ్నించారు. దీంతో పక్కనున్న వైకాపా కౌన్సిలర్లు భాస్కరరెడ్డిపై ఎదురు దాడికి దిగారు. కొద్దిసేపు సభలో వాగ్వాదం జరిగింది. చివరకు అధికారులు కల్పించుకుని సద్దు మణిగించారు. అనంతరం అజెండాలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చదివారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్‌ కిశోర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని