logo

జడ్పీ సభ్యుల జల గళం

ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ ఛైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది.

Updated : 30 Mar 2023 06:49 IST

వాడీవేడిగా జడ్పీ సమావేశం

సమావేశానికి హాజరైన జడ్పీటీసీ సభ్యులు

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ ఛైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. సమావేశానికి కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ, కర్నూలు కార్పొరేషన్‌ కమిషనర్‌ భార్గవతేజ, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసారి రామిరెడ్డి, ఆర్థర్‌, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి ఇస్సాక్‌, కత్తి నరసింహానరెడ్డి, ఉభయ జిల్లాల అధికారులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యారు.

* జడ్పీటీసీ సభ్యులకు గుర్తింపు లేదనే అంశం తనకు బాధ కలిగించిందని, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి జయరాం చెప్పడంతో సభ్యులు మొక్కుబడిగా బల్లలు చరిచారు.

మంత్రి నియోజకవర్గంలోనూ అవస్థలే

వేసవిలో పల్లెల్లో ఎదురవుతున్న మంచినీటి సమస్యను జడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. నిధులు లేకపోవడంతో జల్‌జీవన్‌ పనులు మందకొడిగా నడుస్తున్నాయని, మంచినీటి ఎద్దడికి సమగ్ర ప్రణాళిక ఉన్నా, నిధులు విడుదలకాని పరిస్థితి నెలకొందని జడ్పీటీసీ సభ్యులు నిలదీశారు. మంత్రి గుమ్మనూరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి, హాలహర్వి మండలాల్లో సాగు, తాగునీటికి అవస్థలు పడుతున్నామని, 150 బోర్లకు ఒక్క మెకానిక్‌ కూడా లేకపోతే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జోక్యం చేసుకుని పందికోన జలాశయం నుంచి తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక తయారు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు.

అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది..

ఒక్కో జడ్పీటీసీకి రూ.5 లక్షల నిదులు కేటాయిస్తే ఏ పనులు చేయాలో అంతుపట్టక, నిధులు విడుదల కావడం లేదని ప్రజలకు అబద్ధాలు చెప్పుకొనే పరిస్థితి నెలకొందని సభ్యులు మరోసారి ధ్వజమెత్తారు. గుర్తింపు లేక, నిధులు లేనపుడు పదవులు ఎందుకని సభ్యులు వ్యంగంగా అన్నారు. ఎంపీపీ కార్యాలయంలో కనీసం కూర్చునేందుకు స్థానం లేదని, పేరుకే జడ్పీటీసీలుగా ఉన్నామని, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని సభ్యులు ఏకరవు పెట్టారు.

 ఒక్కో జడ్పీటీసీకి రూ.5 లక్షలు

వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు ఒక్కో జడ్పీటీసీకి రూ.5 లక్షలు కేటాయిస్తున్నామని ఛైర్మన్‌ పాపిరెడ్డి సభలో ప్రకటించారు. 33 మంది సభ్యులకు 44 పనులకు గాను రూ.1.96 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ తెలియచేసే అంశాలపై దృష్టిసారిస్తామన్నారు.

జగనన్నకాలనీలపై ప్రజల్లో అసంతృప్తి

జగనన్న కాలనీలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం లేదని, ఇప్పటికే రెండు ముహూర్తాలు వాయిదా వేశామని సభ్యులు అన్నారు. బిల్లులు సరిగా రావడం లేదని, అననుకూల ప్రదేశంలో నిర్మించడం వల్ల లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదన్నారు. 2021లో ఓటీఎస్‌ కింద సొమ్ము చెల్లించినా ఇంతవరకు లబ్ధిదారులకు స్థలం కేటాయించలేదని ఓర్వకల్లు ఎంపీపీ తెలిపారు. జగనన్న కాలనీల్లో విద్యుత్తు, రహదారులు, మంచినీటి వసతులు మెరుగుపరచాలని సభ్యులు కోరారు. గతంలో రూ.2100 చెల్లించిన లబ్ధిదారులకు ఇంతవరకూ ఇళ్లు మంజూరు కాలేదని ఎమ్మెల్యే కాటసాని అన్నారు.

మూగజీవాలకు ఒక్కపైసా రావడం లేదు

మూగజీవాలు మరణిస్తే రెండేళ్లుగా ఒక్క పైసా సొమ్ము విడుదల కావడం లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ అన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు పథకాలు ఉండాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని పశువైద్యకేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, పశువులకు వైద్యం అందడం లేదని నందికొట్కూరు ఎంపీపీ, పగిడ్యాల జడ్పీటీసీ సభ్యుడు తెలిపారు. పశువైద్యకేంద్రాల్లో స్కానింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రోగనిర్ధారణకు అవకాశముంటుందని నంద్యాల జడ్పీటీసీ సభ్యుడు అన్నారు.

* ఏప్రిల్‌ 15వ తేదీ వరకు తెలుగుగంగ, కేసీ కాల్వకు సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఈ అంశంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఇరిగేషన్‌ ఎస్‌ఈ రెడ్డిశేఖర్‌రెడ్డి తెలిపారు.


ఎమ్మెల్యే కాటసాని ఆగ్రహం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

* బిల్లులు అందకపోవడంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదని ఓర్వకల్లు జడ్పీటీసీ సభ్యుడు తెలిపారు. గతంలో అధికారులు చేసిన తప్పిదంతో నాలుగేళ్లుగా బిల్లులు నిలిచిపోయాయని, ఏమాత్రం సహించేది లేదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్‌జీవన్‌ మిషన్‌ పనులు సరిగా జరœగడం లేదని, పాత గుత్తేదారుల స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వాలని, కొత్త బోర్లకు ప్రతిపాదనలు తయారుచేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ కోరారు.

* గోరకల్లు జలాశయం నుంచి నీటిని తరలించే అధికారులు ఓర్వకల్లు, పాణ్యం మండలాలను ఈ పథకంలో ఎందుకు చేర్చలేదని పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి ఎస్‌ఈ మనోహర్‌ను ప్రశ్నించారు. మా ప్రాంతం నుంచి మరో నియోజకవర్గానికి తీసుకుంటూ, మా మండల ప్రజలకు అన్యాయం చేస్తారా? కొత్తగా ప్రతిపాదనలు ఎందుకు తయారు చేయలేదని, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతతో ఇబ్బందులు పడుతున్నామని అసహనం వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్‌, నంద్యాల కలెక్టర్‌ జోక్యం చేసుకుని ఈ పథకంలో ప్రతిపాదనలు తయారు చేయాలని ఎస్‌ఈని ఆదేశించి ఎమ్మెల్యేను శాంతపరిచారు. అలగనూరు సీపీడబ్ల్యూఎస్‌ పథకంపై అధికారులు స్పందించాలని జడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని