logo

పెద్దలను వదిలి.. రైతులను అడిగి

ఆశల సాగు అప్పులు మిగిల్చింది... చేతిలో చిల్లిగవ్వ లేదు.. అన్నంపెట్టే రైతన్న అప్పులు తీర్చేందుకు వలస బాట పట్టారు. ఇలాంటి దైన్యస్థితిలో రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని సహకార శాఖ అధికారులు డిమాండ్‌ చేయడం వారిని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

Published : 30 Mar 2023 02:43 IST

రుణ వసూళ్ల అధికారుల వివక్ష
న్యూస్‌టుడే, కర్నూలు వ్యవసాయం

ఆశల సాగు అప్పులు మిగిల్చింది... చేతిలో చిల్లిగవ్వ లేదు.. అన్నంపెట్టే రైతన్న అప్పులు తీర్చేందుకు వలస బాట పట్టారు. ఇలాంటి దైన్యస్థితిలో రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని సహకార శాఖ అధికారులు డిమాండ్‌ చేయడం వారిని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో రుణ వసూళ్లపై డీసీసీబీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎలాగైనా రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రుణ చెల్లింపులు చేయాలంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు.

రూ.  రూ.లక్షలు బకాయి ఉన్నా

కొందరు భూస్వాములు సహకార బ్యాంకుల్లో రూ.లక్షల రుణాలు తీసుకుంటున్నారు. ఇక్కడ రూపాయి వడ్డీకి తీసుకుని.. ఆ డబ్బుతో కొందరు సొంత అవసరాలకు వాడుకున్నారు. మరికొందరు వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ బ్యాంకులో ఏడాదికోసారి రుణ చెల్లింపులు చేయనుండటంతో.. ఏడాదిలోపు వ్యాపారాలు చేసుకుంటూ లాభాలు గడిస్తున్నారు. మరోవైపు బ్యాంకులకు రుణ చెల్లింపులు చేయడం లేదన్న విమర్శలున్నాయి. అలాంటి దీర్ఘకాలిక బకాయిదారుల నుంచి జిల్లా సహకార బ్యాంకుకు ఏకంగా రూ.252 కోట్లకుపైగా రావాల్సి ఉంది. సన్న, చిన్నకారు రైతులు ఏడాదిలోపు చెల్లించకుంటే తాఖీదులు ఇచ్చి రుణ చెల్లింపులు చేస్తారా? లేదా ? అని బ్యాంకు సిబ్బంది హుకుం జారీ చేస్తున్నారు. పెద్దపెద్ద రుణాలు తీసుకున్నవారి వద్దకెళ్లి రుణ చెల్లింపులు చేయాలని అడిగే సాహసం చేయడం లేదు.

10,630 మందికి రుణాలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 99 ప్రాథమిక సహకార పరపతి సంఘాల పరిధిలో 23 బ్యాంకు శాఖలు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వీటి ద్వారా 10,630 మంది రైతులకు రూ.460.44 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ఈ నెల 15 నాటికి 6,838 అన్నదాతల నుంచి రూ.252.83 కోట్ల రుణ బకాయిలు రావాల్సి ఉంది. ఆలూరు, ఆదోని, డోన్‌, కోవెలకుంట్ల, కృష్ణానగర్‌, పత్తికొండ శాఖల పరిధిలో బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్లుగా రికవరీలు పెంచేందుకు బ్యాంకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

కొన్ని సంఘాలే రాణింపు

ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రస్తుతం రూ.300 కోట్ల షేర్‌ క్యాపిటల్‌తో.. రూ.3,500 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలో ఐదో అతి పెద్ద బ్యాంకుగా ఉందని పాలకవర్గం చెబుతోంది. మొత్తం 99 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉండగా అందులో నాలుగు సంఘాలు ‘డి’ గ్రేడ్‌లో, 3 సంఘాలు ‘సీ’ గ్రేడ్‌లో ఉన్నాయి. 22 సంఘాలు బి గ్రేడ్‌లో, 70 సంఘాలు ఏ గ్రేడ్‌లో ఉన్నాయి. అన్ని ప్రాథమిక సహకార సంఘాలతో పోలిస్తే 25 సంఘాలు మల్టీ సర్వీసు సెంటర్లుగా రూపాంతరం చెందాయి.


వడ్డీ మాఫీ చేయాలి

- బి.వి.కృష్ణారెడ్డి, మునగాల, గూడూరు

గతేడాది క్వింటా పత్తి ధర సగటున రూ.11 వేలకుపైగా పలికింది. ప్రస్తుతం రూ.6 వేలకు పడిపోయింది. ఎకరాకు ఒకటిన్నర క్వింటా దిగుబడి వచ్చింది. పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితి. రుణాలు చెల్లించాలంటూ సహకార బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అసలు కాదు కదా.. వడ్డీ చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది పత్తి విత్తన కంపెనీలు నిలువునా ముంచాయి. దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. కుటుంబ పోషణే భారంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు