logo

నిధులు.. నినాదాలు

పల్లెల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.. బిందెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం.. నిధుల్లేక అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది.. సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు.. ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని మహిళా జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 30 Mar 2023 02:43 IST

అధికార పార్టీ సభ్యుల నిరసన
సమాధానం చెప్పలేకపోయిన మంత్రి

సభ్యులకు సర్దిచెబుతున్న కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జడ్పీ ఛైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి

కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే: పల్లెల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.. బిందెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం.. నిధుల్లేక అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది.. సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు.. ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని మహిళా జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అధికారపార్టీకి చెందిన 32 మంది జడ్పీటీసీ సభ్యులు జడ్పీ అధ్యక్షుడు యర్రబోతుల పాపిరెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తొలిసారిగా జడ్పీ సమావేశానికి హాజరైన గుమ్మనూరు జయరాం జిల్లా ప్రజలకు ఒక్కహామీ ఇవ్వకపోవడం గమనార్హం.

ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకావడం లేదు

* ఏడాదిన్నర క్రితం జడ్పీటీసీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టాం.. ఇప్పటి వరకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పండి... నిధుల్లేని పదవులు ఎందుకు.. ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకాక సతమతమవుతున్నాం.. తమ సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పాలని మహిళా సభ్యురాళ్లు ముక్తకంఠంతో నినదించారు.
* జడ్పీ సమావేశాలకు రావడం వృథా ? వచ్చామా స్వీట్‌, కారా తిన్నామా.. ఇళ్లకు వెళ్లి అన్నం తిన్నామా అనే స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సభ్యులు లేచి నిరసన వ్యక్తం చేస్తుండగా, మిగిలిన జడ్పీటీసీ సభ్యులు మూకుమ్మడిగా నిలబడి వారికి సంఘీభావం తెలిపారు.  
* నంద్యాల జడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ సమస్యలు తెలియచేసే సమయంలో ఛైర్మన్‌ అభ్యంతరం చెప్పడం సరికాదు.. సమావేశాలకు మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నారు.. మీరే నిర్వహించుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరసన తెలుపుతున్న జడ్పీటీసీ సభ్యురాళ్లు

మంత్రికి నిరసన సెగ

సభ్యుల నుంచి వచ్చే వ్యతిరేకతతో మంత్రికి ఏం చేయాలో అంతుపట్టక నవ్వుతూ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మంచిరోజులు వస్తాయని, సీఎం ఆధ్వర్యంలో అంతా మంచి జరుగుతుందని, అన్ని సమస్యలూ అధిగమిస్తామనే ప్రకటన తప్ప జిల్లాకు ఒక్క హామీ ఇవ్వలేదు. కనీసం పశ్చిమప్రాంతంలోని తాగునీటి సమస్యపైనా స్పందించకపోడం ఏమిటని సభ్యులు చర్చించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని