logo

పత్తికొండ పోలీసు స్టేషన్‌ గేటేసి.. హల్‌చల్‌

పోలీసు స్టేషన్‌ ముందు.. నడి రోడ్డుపై ఓ వ్యక్తి హల్‌చల్‌ సృష్టించాడు. తెల్లటి చొక్కా ప్యాంటు ధరించి.. రాజకీయ నాయకుడిలా రోడ్డుపైకి వచ్చాడు.

Updated : 30 Mar 2023 11:39 IST

బస్‌, కార్ల అద్దాలు ధ్వంసం
అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌తో సహా ముగ్గురిపై దాడి

ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేస్తున్న వన్నూర్‌వలి

పత్తికొండ పట్టణం, న్యూస్‌టుడే: పోలీసు స్టేషన్‌ ముందు.. నడి రోడ్డుపై ఓ వ్యక్తి హల్‌చల్‌ సృష్టించాడు. తెల్లటి చొక్కా ప్యాంటు ధరించి.. రాజకీయ నాయకుడిలా రోడ్డుపైకి వచ్చాడు. పోలీసు స్టేషన్‌ గేటు మూసివేశాడు. పక్కనే ఉన్న ఇనుప పైపు తీసుకొని ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టాడు. పక్కనే ఉన్న కారు అద్దాలన్నీ ధ్వంసం చేశాడు. రహదారిపై అడ్డంగా నిలబడి అటువైపు వెళ్లే వాహనాలపై దాడికి దిగాడు. ఏకంగా పోలీసు స్టేషన్‌లోకి వెళ్లి పూలకుండీలు, ఇతర సామగ్రిని సైతం ధ్వంసం చేశాడు. అడ్డుకోబోయిన వారిపైనా దాడి చేశాడు. ఖబబ్దార్‌ అంటూ.. నడిరోడ్డుపై అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ఇదేదో ఫ్యాక్షన్‌ గొడవ అనుకుంటే పొరపాటే. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి చేసిన హల్‌చల్‌ ఇది. పత్తికొండ పట్టణంలో బుధవారం జరిగింది.

పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఫర్నీచర్‌ ధ్వంసం చేస్తూ..

పత్తికొండ మండలం, హోసూరు గ్రామానికి చెందిన షేక్‌ వన్నూర్‌వలి వయస్సు 44 సంవత్సరాలు. బుధవారం మధ్యాహ్నం పత్తికొండ పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట హల్‌చల్‌ చేశాడు. బస్సు అద్దాలు పగులగొడుతుండగా.. అడ్డుకోబోయిన ఆర్టీసీ డ్రైవర్‌ వెంకటన్నను కాలితో తంతూ దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్‌ రామాంజనేయులు వన్నూర్‌వలిని పట్టుకున్నాడు. దాడిచేసేందుకు యత్నిస్తుండగా.. అక్కడున్న జనమంతా పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వెంటనే అందరూ కలిసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ డ్రైవర్‌ జి.వెంకటన్న ఫిర్యాదు మేరకు షేక్‌ వన్నూర్‌వలిపై కేసు నమోదు చేసి,  దర్యాప్తు చేస్తున్నామని పత్తికొండ టౌన్‌ సీఐ మురళీమోహన్‌ తెలిపారు. వన్నూర్‌వలి మానసిక పరిస్థితి సరిగాలేదని, అందుకే ఇలా ప్రవర్తించాడని సీఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని