logo

వెండి దొంగలు.. ఆ ఇద్దరు పోలీసులే

కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్‌లో 105 కిలోల వెండి అపహరణ మిస్టరీకి తెరపడింది. 2021 జనవరి 28న కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సీజ్‌ చేసి తమిళనాడు వ్యాపారులకు సంబంధించిన 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదును సదరు స్టేషన్‌లోని బీరువా ఉంచగా మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Updated : 31 Mar 2023 11:29 IST

2021 జనవరి 28 రాత్రి సెబ్‌ అధికారులు పట్టుకున్న వెండి, తమిళనాడు వ్యాపారులు, కారు ఇదే

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్‌లో 105 కిలోల వెండి అపహరణ మిస్టరీకి తెరపడింది. 2021 జనవరి 28న కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సీజ్‌ చేసి తమిళనాడు వ్యాపారులకు సంబంధించిన 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదును సదరు స్టేషన్‌లోని బీరువా ఉంచగా మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసు ఉన్నతాధికారి విచారణకు ఉపక్రమించారు. గతంలో కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో పనిచేసిన మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ అమరావతి, కానిస్టేబుల్‌ రమణ ఈ నేరానికి పాల్పడినట్లు తేలినట్లు తెలిసింది. అమరావతి భర్త విజయ్‌భాస్కర్‌ గురువారం ఉదయం ఇంటి నుంచి తప్పించుకునే యత్నం చేయగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఆమెకు సహకరించిన స్టేషన్‌ స్వీపర్‌ అయ్యన్న, వెండి తరలించేందుకు సహకరించిన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు మండల పరిధిలో ఓ పోలీసు రహస్య ప్రదేశంలో పోలీసు ఉన్నతాధికారి గట్టిగా విచారించడంతో ఆ ఇద్దరు పోలీసులు నేరాన్ని అంగీకరించారు. షరాఫ్‌ బజార్‌లోని 12వ నంబరు దుకాణ వ్యాపారికి విక్రయించినట్లు తేలటంతో పోలీసులు రికవరీ చర్యలు చేపట్టారు. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. శుక్రవారం పోలీసు అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు.

వివాదాల స్టేషన్‌

కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌ వివాదాలకు కేంద్రంగా మారింది. సదరు స్టేషన్‌లో గత రెండేళ్లలో ముగ్గురు సీఐలు బదిలీ కాగా ప్రస్తుతం నాలుగో సీఐగా రామలింగయ్య పనిచేస్తున్నారు. 2021లో సీఐగా విక్రమ్‌సింహా ఉన్న సమయంలో నిడ్జూరులో తెదేపా నాయకుడి హత్య జరగటం, తదితర వివాదాల నేపథ్యంలో ఆయన బదిలీ అయ్యారు. తర్వాత వచ్చిన సీఐ కంబగిరిరాముడు ఇలానే సీజ్‌ చేసిన రూ.75 లక్షల మొత్తంలో రూ.15 లక్షల దౌర్జన్యంగా తీసుకోవటం వివాదాస్పదంగా మారడంతో అప్పటి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి సీఐపై కేసు నమోదు చేయించారు. తర్వాత వచ్చిన సీఐ శేషయ్యకు ఓ ఎమ్మెల్యేతో వివాదం నెలకొనటంతో బదిలీ అయ్యారు.

ఉదాసీనంగా వ్యవహరించి..

2021 జనవరి 28వ తేదీ రాత్రి 105 కేజీల వెండి, రూ.2.05 లక్షల నగదును సీజ్‌ చేసి  సెబ్‌కు అప్పగించిన సందర్భంలో కర్నూలు తాలుకా అర్బన్‌ అధికారులు 102 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాల్సి ఉంది.. లేదంటే సంబంధిత శాఖలకు అప్పగించాల్సి ఉంది. సదరు స్టేషన్‌ అధికారి ఎలాంటి చర్యలు తీసుకోకుండా సొత్తును బీరువాలో ఉంచటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన సీఐలు వెండి పట్ల ఉదాసీనంగా వ్యవహరించారు. వార్షిక సందర్భంలోగానీ, పలుమార్లు స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గమనించకపోవటం గమనార్హం. వీరందరి ఉదాసీనత ఆ ఇద్దరికీ దురాలోచన కలిగించినట్లైంది.

అప్పుడే మాయం..

కర్నూలు తాలుకా అర్బన్‌ సీఐగా శేషయ్య ఉన్న సమయంలో అదే స్టేషన్‌లో పనిచేసే హెడ్‌ కానిస్టేబుల్‌ అమరావతి, కానిస్టేబుల్‌ రమణబాబు స్టేషన్‌లో కీలకంగా వ్యవహరించేవారు.. బీరువాలో నిల్వ ఉంచిన వెండిపై కన్నేసిన అమరావతి పలుమార్లు వ్యాపారులకు ఫోన్‌ చేసి తీసుకెళ్లాలని చెప్పగా వారు నిరాకరించారు. దీంతో వారికి వెండి తీసుకెళ్లే ఉద్దేశం లేదని, తీసుకెళ్లి సొమ్ము చేసుకోవాలన్న దురాలోచన కలిగింది. రమణబాబుతో తన ఆలోచనను చెప్పగా అతను చేతులు కలిపాడు. వాటాలపై నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్‌లో సీజ్‌ చేసిన మద్యం ధ్వంసం చేసే కార్యక్రమాన్ని 2022 జూన్‌లో సీఐ శేషయ్య చేపట్టారు. జప్తు చేసిన మద్యం సీసాలను స్టేషన్‌ బయటపెట్టారు. అదే అదనుగా చేసుకుని నిందితులు వెండి బస్తాలను బయట ఉంచారు. అమరావతి భర్త ఆటోలో రావటంతో స్టేషన్‌ స్వీపర్‌ సాయంతో వెండిని అందులో ఎక్కించారు. నంద్యాల చెక్‌పోస్టుకు వెళ్లిన తర్వాత స్వీపర్‌ను కిందికి దింపి వదిలేసి ఇంటికి తీసుకెళ్లారు. వాటాలు పంచుకున్న ఇద్దరు పోలీసులు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అమరావతి తన భర్త సోదరుడి ద్వారా అమ్మినట్లు తెలిసింది. సెబ్‌ అధికారులు సొత్తును అప్పగించే సందర్భంలో వివరాలు నమోదు చేసేందుకు పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన దస్త్రాన్ని ఇద్దరూ తెలివిగా మాయం చేశారు. వచ్చిన డబ్బుతో అమరావతి 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల కారు, ఓ ఇంటి స్థలం కొనుగోలు చేయగా, రమణబాబు పంచలింగాల పరిధిలో 12 సెంట్ల స్థలం కొనుగోలు చేసినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని