logo

పుర ఖాతాల్లో సర్వే ఖర్చు

మున్సిపాలిటీల్లో చేపడుతున్న ‘జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం’ భారం స్థానిక సంస్థలే భరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆదాయం లేక అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి.

Published : 31 Mar 2023 02:12 IST

ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల కసరత్తు
చిన్న మున్సిపాల్టీలు భరించడం కష్టమే
- నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే

నంద్యాలలో రీసర్వే చేస్తున్న ఏజెన్సీ బృందం

మున్సిపాలిటీల్లో చేపడుతున్న ‘జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం’ భారం స్థానిక సంస్థలే భరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆదాయం లేక అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. ‘చెత్త’భారం భరించలేక చేతులెత్తేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల రీసర్వేకు అయ్యే ఖర్చును స్థానిక సంస్థలే వెచ్చించాల్సి ఉంటుందని విడుదలైన జీవో పాలకవర్గాలకు కంటిమీది కునుకులేకుండా చేస్తోంది. ఖర్చును ప్రాథమికంగా లెక్కించి   మున్సిపల్‌ ఖాతాకు బదలాయించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు.

ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగింత

ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరం, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌ పట్టణాల్లో సర్వే చేయాలని నిర్ణయించారు. ఇందులో కర్నూలు నగరం 100 చదరపు కిలోమీటర్లు, నంద్యాల 53 చ.కి.మీ, ఆదోని 49 చ.కి.మీ, ఎమ్మిగనూరు 30 చ.కి.మీ, డోన్‌ 25 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఆయా పట్టణాల్లో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా సర్వే పూర్తి చేశారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా పట్టణాల్లో పూర్తి వివరాలు సేకరించారు. ఏజెన్సీ అందించే చిత్రాలు, సమాచారం ఆధారంగా ఆయా మున్సిపాల్టీల్లో రీసర్వే జరగనుంది.  ఆత్మకూరు, ఆళ్లగడ్డలో త్వరలో ప్రారంభం కానుంది.

పరిపాలన ఆమోదానికి ప్రతిపాదనలు

* సర్వే చేసిన ఏజెన్సీకి డబ్బులు చెల్లించేందుకు పురపాలక అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలో రూ.6 లక్షలు, నంద్యాల, ఆదోనిలో రూ.1.50 లక్షలు చొప్పున, ఎమ్మిగనూరు, డోన్‌లలో రూ.లక్ష చొప్పున ప్రాథమికంగా చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు ఆయా మున్సిపాల్టీలు కౌన్సిల్‌ నుంచి పరిపాలన ఆమోదం పొందేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నాయి.

* సర్వే పూర్తయి యాజమాన్య హక్కులు ఇచ్చే వరకు దశల వారీగా  ఆర్థిక భారం భరించకతప్పదు. కర్నూలు నగరపాలకకు రూ.50 లక్షల వరకు, నంద్యాల, ఆదోని పురపాలకలపై రూ.30 లక్షల వరకు భారం పడనుంది. మిగతా మున్సిపాల్టీలూ రూ.లక్షల్లో వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పరికరాల ఖర్చు

* ఉమ్మడి జిల్లాలోని పది మున్సిపాల్టీల పరిధిలో 3.5 లక్షల మంది భూ యాజమాన్యపు హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘శాశ్వత భూ హక్కు- భూ రక్ష’ పథకం కింద కర్నూలులో 60 డివిజన్లు, నంద్యాల 42, ఆదోనిలో 42, ఎమ్మిగనూరు 24, డోన్‌ 24, ఆత్మకూరు 20, ఆళ్లగడ్డ 20, నందికొట్కూరు 20, గూడూరు, బేతంచెర్లలో 12 డివిజన్ల పరిధిలోని అన్ని రకాల భూములు, ఆస్తులను రీసర్వే చేసి యాజమాన్యపు హక్కులు నిర్ధారిస్తారు.

* రీసర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పాటు రోవర్లు, ట్యాబ్‌లు, డెస్క్‌టాప్‌లు, ప్రింటర్ల వంటి సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాలి. వీటి కొనుగోలుకు అయ్యే ఖర్చును స్థానిక సంస్థలే చెల్లించాలని సూచించింది.

భూముల సమగ్ర సమాచారం సేకరణ

కార్స్‌ టెక్నాలజీ, డ్రోన్స్‌, రోవర్‌ వంటి సాంకేతిక పరికరాల ద్వారా యజమానుల భూ స్థితి, పత్రాల ఆధారంగా హక్కులు ఎలా తెలుసుకోవాలో రీసర్వే బృందాలకు శిక్షణ ఇచ్చారు. రీసర్వేలో భాగంగా మున్సిపాల్టీల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భూములు, అనుబంధ సంస్థల భూములు, ఆస్తులు తదితర వివరాలతో పాటు అధికారిక, అనధికారిక లేఅవుట్ల వివరాలు రీసర్వే రికార్డుల్లో, అక్షాంశ, రేఖాంశాలతో నమోదు చేస్తున్నారు. ఆయా భౌగోళిక అంశాల ఆధారంగా మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.   ప్రైవేటు ఆస్తులు, పట్టణ వాసుల భూహక్కు పత్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రారంభించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని