logo

యువికా.. విజ్ఞాన వేదిక

విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది.

Published : 31 Mar 2023 02:12 IST

గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యం

యువికా కార్యక్రమ ప్రచార పత్రం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. యువికా(యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో దానికి శ్రీకారం చుట్టారు. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా ఛార్జీలు, బస, భోజనవసతితోపాటు అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పించనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 42 వేల మంది విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు.

ఎంపిక పద్ధతి

8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శనల్లో భాగస్వామ్యం, సైన్స్‌ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్‌లో పాల్గొని మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిస్టర్డ్‌ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్‌ పోటీల్లో పొల్గొని ప్రతిభ చాటినవారు, స్కాట్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లో సభ్యులు, ఆన్‌లైన్‌ క్విజ్‌లో ప్రతిభ చూపినవారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది

12 రోజులపాటు..

శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్‌ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్‌ ఉపాధ్యాయుడికీ ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తరువాత శ్రీహరికోటలోని సతీష్‌ దావన్‌ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు.

దరఖాస్తు ఇలా..

* ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది.

* ఈ లింక్‌ ద్వారా /R https://www.isro.gov.in/YUVIKA.html నాలుగు దశల్లో విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

* మొదట ఇ-మెయిల్‌ ఐడీతో వివరాలు నమోదు చేసుకోవాలి.

* రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనాలి.

* క్విజ్‌ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి.

* గత మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఏవైనా ఉంటే, వాటి నకళ్లపై విద్యార్థి సంతకం చేసి అప్‌లోడ్‌ చేయాలి.

దరఖాస్తులు సమర్పించేందుకు ఏప్రిల్‌ 3వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఎంపిక జాబితాను రెండు విడతల్లో ప్రకటించి ఆర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు.

శిక్షణ కేంద్రాలు

1. ఐఐఆర్‌ఎస్‌, డెహ్రాడూన్‌

2. విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం, తిరువనంతపురం

3. సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట

4. యు.ఆర్‌.రావు సాటిలైట్‌ సెంటర్‌, బెంగళూరు

5. స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌, అహ్మదాబాద్‌

6. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, హైదరాబాదు

7. నార్త్‌-ఈస్ట్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌, షిల్లాంగ్‌


రిజిస్ట్రేషన్‌ గడువు: 03-04-2023

మొదటి విడత ఎంపిక జాబితా విడుదల: 10-04-2023

రెండో విడత ఎంపిక జాబితా విడుదల: 20-04-2023

ఎంపికైనవారు ఇస్రోలో రిపోర్ట్‌ చేయడం: 14-05-2023

యువికా కార్యక్రమం: 15-05-2023 నుంచి 26-05-2023 వరకు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని