logo

వన్యప్రాణులకు నీటి కొరత లేదు

నల్లమలలో వన్యప్రాణుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పులులతో పాటు ఇతర జంతువుల సంతతి పెరిగిందని ఆత్మకూరు డివిజన్‌ అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అలెన్‌చాన్‌టెరాన్‌ చెప్పారు.

Published : 31 Mar 2023 02:12 IST

అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అలెన్‌చాన్‌టెరాన్‌

అలెన్‌చాన్‌టెరాన్‌, డిప్యూటీ డైరెక్టర్‌

ఆత్మకూరు, న్యూస్‌టుడే : నల్లమలలో వన్యప్రాణుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పులులతో పాటు ఇతర జంతువుల సంతతి పెరిగిందని ఆత్మకూరు డివిజన్‌ అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అలెన్‌చాన్‌టెరాన్‌ చెప్పారు. పులులు పెరిగి పెద్దవయ్యే కొద్దీ తమకంటూ నిర్ధిష్ట సరిహద్దులను ఏర్పరుచుని వాటి పరిధిలోనే సంచరిస్తుంటాయని తెలిపారు. వాటి సంతతి పెరగడంతో కొన్ని అటవీ సమీప గ్రామాల పరిధిలోని పంట పొలాల్లో సంచరిస్తున్నాయన్నారు. వేసవిలో నల్లమలలో వన్యప్రాణులకు తగినన్ని జల వనరులు అందుబాటులో ఉన్నాయని, నీటికి ఎలాంటి కొరత లేదని చెప్పారు. ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో పలు అంశాలు వివరించారు.

* నల్లమల అడవిలో వన్యప్రాణులకు తాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉంది. సహజసిద్ధమైన నీటి కుంటలు ఉన్నాయి. సిద్ధాపురం చెరువులో నీరు పుష్కలంగా ఉంది.

* ఈ ఏడాది ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పించేందుకు రూ.7 లక్షలు నిధులు మంజూరయ్యాయి. చెక్‌డ్యాంలు, సాసర్‌ ఫిట్లను ట్యాంకర్ల ద్వారా నింపుతున్నాం. ఉప్పు గడ్డలు ఏర్పాటు చేస్తున్నాం.

* నల్లమల పరిధిలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాం. పులుల సంతతి పెరగడంతో అవి దూర దూరంగా సంచరిస్తున్నాయి. ఎన్‌ఎస్‌టీఆర్‌ పరిధిలో 73, మన రాష్ట్రంలో 55 వరకు పులులు ఉన్నాయి. సమీప పంట పొలాల్లో గడ్డి ఉండటంతో నీరు, ఆహారం కోసం వన్యప్రాణులు ఇటువైపు వస్తున్నాయి. వాటిని వేటాడేందుకని పులులు గ్రామాలకు సమీపంగా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మొక్కజొన్న పంటల సాగు పెరగడంతో అడవి పందులు అధికంగా వస్తున్నాయి.

* కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం సమీప అటవీ ప్రాంతంలో ఒక మగ, రెండు ఆడ పులులు సంచరించాయి. అక్కడ ఇటీవల గ్రామస్థులకు దొరికిన నాలుగు కూనలు టి108 ఆడపులికి పుట్టినవేనని కచ్చితంగా చెప్పలేం. రెండు ఆడపులుల్లో ఒకటి తెలంగాణ రాష్ట్రం ఆమ్రాబాద్‌ అభయారణ్యంలో తిరుగుతున్నట్లు తెలిసింది. కెమెరా ట్రాప్‌లో చిక్కిన టి108 పులి ఆ సమయంలో కడుపుతో ఉండటం, అది ఈ ప్రాంతంలో తిరగడంతో దాని పిల్లలే అయ్యుండొచ్చని భావించాం.

* అటవీ సమీప పంట పొలాల్లో పండ్ల తోటల సాగు పెరుగుతోంది. దీంతో పంట పొలాల్లో దొరికే ఆహారం కోసం ఎలుగుబంట్లు పొలాల వైపు వస్తున్నాయి. రైతులు వాటిని చూస్తే మాకు సమాచారం ఇవ్వాలి. వాటిని అడవిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని