logo

మల్లెంపల్లెలో ఇరువర్గాల ఘర్షణ

డోన్‌ మండలం మల్లెంపల్లెలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది.

Published : 31 Mar 2023 02:12 IST

ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకుంటున్న ఇరువర్గాలు

డోన్‌, డోన్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: డోన్‌ మండలం మల్లెంపల్లెలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మల్లెంపల్లె గ్రామంలో మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ రామచంద్రుడు కుమారుడు సుధీర్‌ వద్దకు అదే గ్రామానికి చెందిన సుధాకర్‌ కూలీ పనుల నిమిత్తం వెళ్లేవారు. ఇందులో భాగంగా శ్రీరామనవమి పండగ సందర్భంగా తనకు కూలీ డబ్బులు ఇవ్వాలని వెళ్లి అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సుధాకర్‌పై సుధీర్‌ దాడి చేశారు. విషయం తెలుసుకున్న సుధాకర్‌ బంధువులైన సుంకన్న, అతడి కుమారుడు ఎందుకు దాడి చేశారని ప్రశ్నించేందుకు వెళ్లడంతో అక్కడున్న ఇరువర్గాల మధ్య ఘర్షన చోటుచేసుకుంది. ఇందులో భాగంగా మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌పై వారు దాడి చేయడంతో తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయం ఇరువర్గాలకు చెందిన బంధువులందరికీ తెలియడంతో ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో ఓ వర్గానికి చెందిన సుంకన్నకు తలకు తీవ్ర గాయం కాగా, మరో వర్గానికి చెందిన రాజుకు తలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని చికిత్స నిమిత్తం డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తీసుకెళ్లారు.

పోలీసుల ఎదుటే దాడులు..

మల్లెంపల్లె గ్రామంలో గురువారం శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ వైపు ఉత్సవాలు జరుగుతుండగానే మరోవైపు ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘర్షణ చోటుచేసుకున్న ప్రాంతానికి చేరుకుని ఇరువార్గల వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. మరికొంతసేపటికే ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుని పోలీసుల ఎదుటే ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులతోపాటు ఒక హోంగార్డుకు స్వల్పగాయాలైనట్లు పేర్కొన్నారు.

నివురుగప్పిన నిప్పులా...

మల్లెంపల్లె గ్రామంలో కొన్నేళ్లుగా ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలోనూ ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం వైకాపా, తెదేపా వర్గాలు గ్రామంలో బలంగా ఉండటంతో ఈ రెండు వర్గాల నడుమ ఆధిపత్య పోరు తీవ్రంగానే నడుస్తోంది. దీంతో ప్రస్తుతం జరిగిన ఈ ఘర్షణ ఎక్కడకు దారి తీస్తుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మల్లెంపల్లె నివురుగప్పిన నిప్పులా ఉంది.

చికిత్స పొందుతున్న సుంకన్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని