logo

కొత్త ఇంటికి బాదుడు

కొత్త ఇంటి నిర్మాణ సమయంలో విద్యుత్తు అవసరం తప్పనిసరి. దీన్ని ఆసరా చేసుకుని కేటగిరి-2 కింద (వాణిజ్య అవసరాల) రూ.5,600 వసూలు చేస్తున్నారు.

Published : 31 Mar 2023 02:18 IST

- న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

కొత్త ఇంటి నిర్మాణ సమయంలో విద్యుత్తు అవసరం తప్పనిసరి. దీన్ని ఆసరా చేసుకుని కేటగిరి-2 కింద (వాణిజ్య అవసరాల) రూ.5,600 వసూలు చేస్తున్నారు. ప్రజలపై భారం మోపకూడదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు దీన్ని అమలు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఖజానా నింపుకొనేందుకు కచ్చితంగా అమలు చేస్తోంది.

తడిసిమోపెడు

* కొత్తగా ఎవరు ఇల్లు నిర్మించుకున్నా కేటగిరి-2 కిందనే కనెక్షన్‌ ఇస్తున్నారు. యూనిట్‌ విద్యుత్తుకు రూ.5.40కుపైగా వసూలు చేస్తున్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసిన తర్వాత మీటర్‌ను కేటగిరి-1 కిందకు మార్చుకోవాలి. ఇందుకు మళ్లీ రూ.300 రుసుము చెల్లించాలి.

* కేటగిరి-2 కింద తీసుకున్న కనెక్షన్‌ తీసుకుంటే మొదటి 30 యూనిట్లకు రూ.5.40 చెల్లించాల్సి ఉంటుంది. 70 యూనిట్లు వాడితే యూనిట్‌కు రూ.7.65 చెల్లించాలి. సాధారణంగా కేటగిరి-1 కిందనే కనెక్షన్‌ పొందితే మొదటి 30 యూనిట్లకు ఒక యూనిట్‌కు కేవలం రూ.1.90 మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది. 70 యూనిట్లకు రూ.3 చెల్లించాల్సి ఉంటుంది.

* విద్యుత్తు శాఖ నిర్ణయంతో అటు కనెక్షన్‌ తీసుకునేందుకు రూ.3,600 అధికంగా చెల్లించడంతోపాటు నిర్మాణం పూర్తయ్యేలోపు వాడుకునే విద్యుత్తుకు అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది.

పేదల ఇళ్లకూ విధింపు

ప్రభుత్వ ఆర్థిక సాయంతో నిర్మించుకుంటున్న ఇళ్లకూ కొత్త మీటర్‌ కావాలంటే రూ.5,600 చెల్లించి కేటగిరి-2 కింద కనెక్షన్‌ పొందాల్సి ఉంటుంది. గతంలో సాధారణ కనెక్షన్‌ కింద కేటగిరి-1 రూ.2,000 చెల్లిస్తే కొత్త మీటర్‌ వచ్చేది. ఏడాది కిందటి నుంచి నిబంధనలను సాకుగా చూపి ప్రజల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రస్తుతం 19 వేల వరకు పీఎంఏవై కింద గృహాలు నిర్మించుకుంటున్నారు. వీటితోపాటు సొంతంగా 3 వేల మందికిపైగా గృహాలు నిర్మించుకుంటున్నట్లు అంచనా. ఇందులో కనీసం 20 వేల మంది కేటగిరి-2 కింద కనెక్షన్‌ తీసుకుని అధిక ధరకు విద్యుత్తు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కేటగిరి-2 కింద కనెక్షన్‌ తీసుకోవడంతో దాదాపు రూ.6 వేల వరకు అధికంగా భారం పడుతోందని ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఆళ్లగడ్డలో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

కేటగిరి-2 కింద విద్యుత్తు కనెక్షన్‌ తీసుకున్న పీఎంఏవై గృహం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు