logo

దిగువ కాలువ రైతుల దిగాలు

పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే తుంగభద్ర కాలువల్లో నీటి మట్టం తగ్గడం రైతులను కలవరపరుస్తోంది.

Published : 02 Apr 2023 02:49 IST

దిగువ కాలువలో తగ్గిన నీటిమట్టం

పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే తుంగభద్ర కాలువల్లో నీటి మట్టం తగ్గడం రైతులను కలవరపరుస్తోంది. జలాశయంలో నీళ్లు సమృద్ధిగా ఉండటంతో రెండో పంటపై రైతులు ఆళ పెట్టుకున్నారు. ఎక్కువగా వరి సాగు చేశారు. దిగువ కాలువలో ప్రస్తుతం నీటినిల్వలు తగ్గుముఖం పట్టడం.. పంట కీలకదశలో ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పాలకులు స్పందించి కాలువల్లో నీటి సరఫరా సామర్థ్యాన్ని పెంచాలని విన్నవిస్తున్నారు.

 న్యూస్‌టుడే, హొళగుంద, హాలహర్వి


గింజ గట్టిపడే దశలో పంట

ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల పరిధిలో పలు గ్రామాల మీదుగా దిగువ కాలువ వెళ్తోంది. రబీలో ఒక లక్ష ఎకరాలకు సాగునీరు,  వందకు గ్రామాలకుపైగా తాగునీరు అందిస్తోంది. ఆయకట్టు పరిధిలో 70 శాతం వరి పంట సాగు చేస్తుంటారు. ప్రస్తుతం 60 శాతం పంట గింజదశలో ఉంది. మిగిలిన 40 శాతం పొట్ట, కంకిదశలో ఉంది. ఈ సమయంలో పంటకు సమృద్ధిగా నీరు అందాలి. లేదంటే గింజలు తాలు పోయే అవకాశం ఉంది. గత రెండ్రోజులుగా  దిగువ కాలువలో నీటిమట్టం తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో భారీ వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రబీలోనైనా దిగుబడి వస్తుందన్న ఆశలో రైతులు ఉన్నారు. ఈ దశలో నీరు తగ్గడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది.

నీటి వాటాకు కోత

*  గతనెల 31వ తేదీ నాటికే కర్ణాటక  వాటా అయిపోవడంతో నీటిమట్టం తగ్గించారు. ఏపీ  వాటాకు తగినట్లుగా కర్ణాటకకు నీరు అందించాలని అక్కడి అధికారుల టీబీ బోర్డుకు మరోసారి ప్రతిపాదనలు పెట్టడంతో నీటిమట్టం పెంచారు. ఒకటి, రెండు రోజుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే కర్నూలు జిల్లాలో పంటలకు నీరు అందించడం కష్టమవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగువకాల్వకు ఈనెల 10వ తేదీ వరకు నీరు అందిస్తామని బోర్డు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న నీటిమట్టం పెంచితేనే  పంటలు గట్టెక్కుతాయని రైతులు పేర్కొంటున్నారు.
*  ఏపీ వాటా కిందనిత్యం 700 క్యూసెక్కులు రావాలి.. 500 క్యూసెక్కులకు మించి రావడం లేదు. దీనిపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


* టీబీ డ్యాంలో ప్రస్తుత నీటి మట్టం :  1585.38 అడుగులు
* నీటినిల్వ: 7.58 టీఎంసీలు
* అవుట్‌ ఫ్లో: 5,593 క్యూసెక్కులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని