logo

అనుకోని ప్రమాదం.. నేలకే పరిమితం

ఆ యువకుడి వయస్సు 34 ఏళ్లు. అయినా జీవచ్ఛవంలా నేల పైనే పడుకుని ఉంటారు. మాట్లాడలేరు, కనీసం కాళ్లు, చేతులు కదల్చలేరు, కళ్లు తిప్పి చూడటం తప్ప ఏమీ చేయలేని దీనస్థితిలో ఉండిపోయారు.

Published : 02 Apr 2023 02:49 IST

కుమారుడు హుసేనయ్యకు సేవ చేస్తున్న తండ్రి లక్ష్మయ్య

ఆళ్లగడ్డ, చాగలమర్రి, న్యూస్‌టుడే: ఆ యువకుడి వయస్సు 34 ఏళ్లు. అయినా జీవచ్ఛవంలా నేల పైనే పడుకుని ఉంటారు. మాట్లాడలేరు, కనీసం కాళ్లు, చేతులు కదల్చలేరు, కళ్లు తిప్పి చూడటం తప్ప ఏమీ చేయలేని దీనస్థితిలో ఉండిపోయారు. ప్రస్తుతం ఆ యువకుడి బాగోగులన్నీ 70 ఏళ్ల తండ్రే చూస్తున్నారు. ఈ యువకుడి పేరు హసేనయ్య, ఊరు చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లె. పదేళ్లుగా అతనిది ఇదే పరిస్థితి. అన్ని సపర్యలు తండ్రి లక్ష్మయ్య చూడాల్సిందే.

విధి చిన్నచూపు చూసింది

10 ఏళ్ల కిందటి వరకు అందరు యువకుల్లాగానే హుసేనయ్య చలాకీగా ఉంటూ అన్ని పనులు చేసుకునేవారు. ఇంటర్‌ వరకు చదివిన ఇతడు హైదరాబాద్‌లోని ఓ కర్మాగారంలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.12 వేలు వేతనం వస్తుండటంతో జీవితంలో స్థిరపడ్డారని భావించి హుసేనయ్యకు వివాహం చేయాలని తండ్రి లక్ష్మయ్య నిర్ణయించారు. తానొకటి తలిస్తే దేవుడొకటి తలుస్తాడన్నట్లు.. విధి హుసేనయ్యపై చిన్నచూపు చూసింది. పరిశ్రమలో పని చేస్తూ గాయపడ్డారు హుసేనయ్య. తలకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తండ్రి వెంటనే హైదరాబాద్‌కు వెళ్లి కుమారునికి ఆసుపత్రిలో వైద్యం చేయించారు, అయితే ఫలితం కనిపించలేదు. రూ.12 లక్షలు ఖర్చు చేసిన తర్వాత కోమా నుంచి బయటకు వచ్చి కళ్లు తెరిచి చూడటం ప్రారంభించారు. రెండెకరాల భూమిని అమ్మి ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా అతనిలో మార్పు రాలేదు. అతని మెదడుకు అంతర్గత గాయాలు కావడంతో నయమయ్యే అవకాశాలు లేవని వైద్యులు చావు కబురు చల్లగా చెప్పారు. గత్యంతరం లేక తండ్రి లక్ష్మయ్య కుమారుడిని సొంతూరుకు తీసుకువచ్చారు. అది మొదలు ఇప్పటి వరకు అన్నీ తానై కుమారుడి సేవలో ఉండిపోతున్నారు. అన్నం తినిపించడం, స్నానం చేయించడం, మల, మూత్ర విసర్జన చేసినప్పుడు శుభ్రం చేయడం.. ఇలా అన్ని పనులు తండ్రే చూసుకుంటున్నారు. కుమారుడి సపర్యలకే రోజంతా సరిపోతుండటంతో ఉన్న ఎకరం భూమిని సైతం సాగు చేసుకోలేకపోతున్నారు. లక్ష్మయ్య భార్య దస్తగిరమ్మ కూలీ పనులు చేయగా వచ్చే సంపాదనతోపాటు కుమారుడికి వచ్చే దివ్యాంగుల పింఛన్‌, తనకు వచ్చే వృద్ధాప్య పింఛన్‌తో కుటుంబం గడుస్తోంది. హుసేనయ్యకు నెలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చు వస్తోంది. ఓ వైపు వృద్ధ దంపతులకు అనారోగ్య సమస్యలు, కుటుంబ ఖర్చులు ఇలా సమస్యలన్నీ చుట్టుముట్టినా కుమారుడిపై మమకారంతోనే అన్నీ ఓర్చుకుంటూ జీవిస్తున్నారు. శరీరంలో కళ్లు తప్ప ఏవీ పని చేయని తన కుమారుడికి నరాల బలహీనతతో బాధపడే వారికి నెలకు ఇచ్చే రూ.10 వేల పింఛన్‌ మంజూరు చేయాలని లక్ష్మయ్య కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని