logo

భక్తుల.. నిలువు దోపిడీ

పలు దేవస్థానాల్లో స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.

Published : 29 May 2023 03:44 IST

గేటు వసూళ్ల పేరుతో జేబుకు చిల్లు
ఆలయాల పరిసరాల్లో కానరాని పార్కింగ్‌ స్థలాలు

అహోబిలంలో గేటు వసూలు చేస్తున్న సిబ్బంది

ఆళ్లగడ్డ, బేతంచెర్ల, మహానంది, న్యూస్‌టుడే : పలు దేవస్థానాల్లో స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఆలయ ఆవరణలో అడుగు పెట్టకముందే అక్రమ వసూళ్ల బారిన పడుతున్నారు. అహోబిలం, మహానంది, మద్దిలేటి తదితర క్షేత్రాల్లో ఇష్టానుసారంగా టోల్‌ వసూలు చేస్తున్నారు. వాహనాలకు వందల రూపాయలు వసూలు చేసే దేవస్థానం, పంచాయతీరాజ్‌ అధికారులు కనీసం వాహనాలను నిలిపేందుకు స్థలాలు కేటాయించకపోవడం గమనార్హం.

అహోబిలంలో భారీగా..

అహోబిల క్షేత్రంలో దోపిడీ మరీ ఎక్కువగా ఉంది. కారుకు రూ.50 వసూలు చేయాల్సి ఉండగా రూ.100, ఆటోకు రూ.50, కొన్ని సందర్భాల్లో బస్సుకు రూ.200 తీసుకుంటున్నారు. ఇక్కడ వాహనాల గేటు వసూళ్ల బాధ్యత పంచాయతీవారు నిర్వహిస్తున్నారు. అహోబిలంలోని స్థలాల్లో 80 శాతం అటు దేవస్థానానికి, ఇటు అటవీ శాఖలకు చెందినవి ఉంటాయి. అహోబిలం అటవీ అందాలను చూసేందుకు యాత్రికులు వస్తుంటారు. వారు తమ వాహనాలను దేవస్థానం స్థలంలో, ఎగువ అహోబిలంలో అటవీ శాఖకు చెందిన స్థలంలోనే ఆపుతారు. ఇక్కడ ఏ వాహనానికి ఎంత వసూలు చేయాలో తెలిపే బోర్డు ప్రదర్శించకపోవడం గమనార్హం.

భద్రత కల్పించరు..

అహోబిలంలో లారీకి రూ.100, ఆటోకు రూ.40, ట్రాక్టర్‌కు రూ.80, కారుకు రూ.50 తీసుకుంటున్నారు. అధికంగా వసూలు చేస్తున్న వీరు స్థలం చూపి వాహనాలకు భద్రత కల్పించాలి. క్షేత్రంలో ఇవేమీ కనిపించవు. నగదు తీసుకోవడం తప్ప మరేమీ పట్టించుకోరు.

సంబంధం లేదంటూ..

* జిల్లాలోని ప్రముఖ దేవస్థానాలకు ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇలాంటి వాహనాలు వస్తే గేటు వసూలు చేసేవారికి పండగే. వారి నుంచి ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతుంటారన్న ఆరోపణలున్నాయి. అహోబిలంలో గేటు వసూళ్లపై ఇటీవల తెలంగాణకు చెందినవారు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేయగా, వసూళ్లకు..  దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదంటూ ఆలయ అధికారులు చేతులు దులిపేసుకున్నారు.

* నిబంధనల ప్రకారం ఆటోకు రూ.20, కారు రూ.30, బస్సు రూ.100, ట్రాక్టరుకు రూ.50 వసూలు చేయాల్సి ఉంది. ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు.

రూ.కోటికిపైగా ఆదాయం ఉన్నా..

మహానందిలో కారుకు రూ.80, బస్సు రూ.150, ఆటో రూ.30, లారీకి రూ.150 వసూలు చేస్తున్నారు. ఇక్కడ వాహనాల రుసుము కోసం నిర్వహించిన వేలం పాట ద్వారా రూ.1.56 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంత భారీగా వస్తున్నా వాహనాలకు సరైన పార్కింగ్‌ సౌకర్యం లేదు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపాల్సిన దుస్థితి. ఉగాది, శివరాత్రి సమయాల్లో వాహనాలను క్షేత్రానికి 1.50 కి.మీ. దూరంలోనే ఆపేస్తారు. అయినా గేటు మాత్రం యథావిధిగా చెల్లించాల్సిందే.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని