logo

నిల్వలు నిండుకున్నాయ్‌

రానున్న రోజుల్లో పేదలకు కందిపప్పు అందే పరిస్థితి కానరావడంలేదు. ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రాయితీపై కిలో రూ.67 చొప్పున కార్డుదారులకు కందిపప్పు అందజేస్తోంది.

Published : 29 May 2023 03:44 IST

కందిపప్పు పంపిణీ ప్రశ్నార్థకమే

కర్నూలు పౌరసరఫరాల గోదాము నుంచి లారీలోకి బస్తాలు లోడు చేస్తున్న కార్మికుడు

కర్నూలు సచివాలయం, వెల్దుర్తి, న్యూస్‌టుడే: రానున్న రోజుల్లో పేదలకు కందిపప్పు అందే పరిస్థితి కానరావడంలేదు. ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రాయితీపై కిలో రూ.67 చొప్పున కార్డుదారులకు కందిపప్పు అందజేస్తోంది. ప్రస్తుతం చేతులెత్తేసింది. రానున్న రోజుల్లో వాటిని అందిస్తారో? లేదో? తెలియని పరిస్థితి. కందిపప్పు సరఫరా కష్టమేనని, పరిస్థితులు చూస్తుంటే ఆగిపోయినట్లేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదాముల్లో కందిపప్పు నిల్వలు పూర్తిగా లేకపోవడంతో జూన్‌ నెల కోటా లేనట్లేనని స్పష్టంగా అర్థమవుతోంది.

సరఫరా కాక..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్డుదారులకు ప్రతి నెలా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, పంచదార, కందిపప్పు అందజేస్తున్నారు. గత కొద్ది నెలలుగా బియ్యం మినహా చక్కెర, కందిపప్పు సరిగా ఇవ్వడం లేదు. జూన్‌ నెల కోటాకు సంబంధించి కర్నూలు జిల్లాకు 636, నంద్యాల జిల్లాకు 530 టన్నుల వరకు కందిపప్పు కేటాయింపులు చేశారు. ప్రస్తుతం పౌరసరఫరాల గోదాముల్లో కందిపప్పు నిల్వలు నిండుకున్నాయి. హైదరాబాద్‌, వినుకొండ ప్రాంతాల్లోని సరఫరాదారుల నుంచి కందిపప్పు రాలేదు. జూన్‌ 1 నుంచి బియ్యం పంపిణీ మొదలు కానుంది. గోదాముల నుంచి చౌక దుకాణాలకు నిత్యావసర సరకుల సరఫరా కొనసాగుతోంది. ఇప్పటివరకు జిల్లాకు కందిపప్పు సరఫరాపై ఎలాంటి ఆదేశాలు రాలేదు.

బయట రెట్టింపు ధర....

ప్రభుత్వం కిలో కందిపప్పు రూ.67కు విక్రయిస్తోంది. మార్కెట్‌లో కిలో రూ.125 నుంచి రూ.140 వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు.

* ఉమ్మడి జిల్లాలోని పౌరసరఫరాల గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. అరకొర కందిపప్పును అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తి కోటా ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి.

డీడీలు చెల్లించినా..

*కందిపప్పు కోసం డీలర్లు పూర్తి కోటా కోసం డీడీలు చెల్లించారు. తీరా గోదాముల్లో నిల్వలు కానరావడం లేదు. కందిపప్పు సరఫరాలో జాప్యం జరుగుతోందని.ప్రస్తుతం గోదాముల్లో ఉన్న కందిపప్పు నిల్వల్లో 25 శాతం కార్డుదారులకు పంపిణీ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

* కర్నూలు పౌరసరఫరాల గోదాము పరిధిలో కర్నూలు అర్బన్‌, కర్నూలు రూరల్‌, కల్లూరు, ఓర్వకల్లు మండలాల పరిధిలో 287 చౌక దుకాణాలు ఉన్నాయి. బియ్యం 2,800 టన్నులు, చక్కెర 70 టన్నులు, కందిపప్పు 25 శాతం కేటాయించినట్లు చెబుతున్నారు. సోమవారం నుంచి చౌక దుకాణాలకు బియ్యం, కందిపప్పు, చక్కెర సరఫరా చేస్తున్నామని.. ఇప్పటివరకు వందకుపైగా దుకాణాలకు పంపిణీ చేశామని చెబుతున్నారు. 50 దుకాణాలకు మాత్రమే 20 శాతం కందిపప్పు సరఫరా చేశారని డీలర్లు పేర్కొంటున్నారు. డీడీలు చెల్లించామని.. ఇప్పుడేమో మళ్లీ కందిపప్పు గోదాముకు వస్తే ఇస్తామని అధికారులు చెబుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు