logo

రూ.వేలు చెల్లిస్తూ.. రూ.కోట్లు గడిస్తూ

పులికనుమ జలాశయంలో చేపల పెంపకం పేరుతో అధికార పార్టీ నేతలు ధనదాహం తీర్చుకుంటున్నారు. తక్కువకు టెండర్లు వేసి చేప పిల్లలు వదిలి రూ.లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు.

Published : 29 May 2023 03:44 IST

పులికనుమలో చేపల వేట 
అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం

పులికనుమ జలాశయంలో చేపల పెంపకం పేరుతో అధికార పార్టీ నేతలు ధనదాహం తీర్చుకుంటున్నారు. తక్కువకు టెండర్లు వేసి చేప పిల్లలు వదిలి రూ.లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో ఇతరులు టెండర్లు వేసే సాహసం చేయడం లేదు.

ఎమ్మిగనూరు, కోసిగి, న్యూస్‌టుడే: కోసిగి-పెద్దకడబూరు మండలాల మధ్య పులికనుమ ప్రాజెక్టు 750 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ పరిధిలో) కోసం రూ.310 కోట్లతో దీనిని నిర్మించారు. ఇందులో 1.226 టీఎంసీల నీటిని నింపి ఎల్లెల్సీ కాలువ 270 కి.మీ. వద్ద అనుసంధానం చేయాల్సి ఉంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో సుమారు 11 మండలాల్లో 26,400 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. సాతనూరు వద్ద తుంగభద్ర నది నుంచి నీటిని తోడి జలాశయంలో నిల్వ చేస్తారు. దీని కోసం 53 రోజుల సమయం తీసుకుని వర్షాకాలంలో నీటిని నింపుతారు. ఎల్లెల్సీ ద్వారా పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది. పులికనుమ ప్రాజెక్టు సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రసుత్తం 0.465 టీఎంసీలు ఉంది. వీటిని ఎమ్మిగనూరు, మంత్రాలయంలోని కొన్ని గ్రామాల కోసం నిల్వ చేశారు. సమృద్ధిగా నీరు నిల్వ ఉండటంతో చేపల పెంపకానికి అనువుగా మారింది. ఇదే అవకాశంగా అధికార పార్టీ నేతలు దందాకు పాల్పడుతున్నారు.

తక్కువకు పాడుకుని..

అధికార పార్టీ నేతలు సిండికేట్‌గా మారి 2022లో రూ.60 వేలకు టెండరు వేసి లీజుకు తీసుకున్నారు. ఈ ఏడాది రూ.80 వేలకు వేలం పాట పాడుకున్నారు. రూ.కోట్లు కొల్లగొడుతూ ప్రభుత్వానికి రూ.వేలల్లో చెల్లిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అనుచరులే పాల్గొంటుండటంతో ఎవరూ అడ్డు వచ్చినా బెదిరిస్తున్నారు.

యథేచ్ఛగా ఎగుమతి

పులికనుమ జలాశయంలో చేపల పెంపకాన్ని గత రెండేళ్లుగా అధికార పార్టీ నేతలు దక్కించుకుంటున్నారు. మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు టెండరు దక్కించుకుని 8 లక్షలకుపైగా చేప పిల్లలు వదిలినట్లు సమాచారం. గతేడాది జలాశయంలో చేపలు పట్టుకుని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. ఒక మినీ లారీలో 12 క్వింటాళ్లకుపైగా చేపలను బెంగళూరు, హైదరాబాద్‌ తదితర మార్కెట్లకు నేరుగా తరలిస్తున్నారు. ఇలా ఏటా 200కిపైగా మినీ లారీలు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో లారీకి కనీసం రూ.3 లక్షల ప్రకారం ఆర్జిస్తున్నారు. ఏడాదిలో రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకుపైగా అమ్మకాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని