logo

కరకట్ట భూమి కార్యాలయానికి

జిల్లా కేంద్రం నంద్యాలలో వైకాపా కార్యాలయ భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు ప్రక్రియను మున్సిపల్‌ పాలకవర్గం వ్యూహాత్మకంగా పూర్తిచేసింది. గత ఆరు నెలలుగా స్థలం కేటాయింపుపై వైకాపా వర్గాల్లో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

Published : 30 May 2023 02:56 IST

సొంతం చేసుకున్న అధికార పార్టీ

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రం నంద్యాలలో వైకాపా కార్యాలయ భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు ప్రక్రియను మున్సిపల్‌ పాలకవర్గం వ్యూహాత్మకంగా పూర్తిచేసింది. గత ఆరు నెలలుగా స్థలం కేటాయింపుపై వైకాపా వర్గాల్లో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తొలుత ఆర్‌ఏఆర్‌ఎస్‌ స్థలంలో కొంతభాగం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ జిల్లా నాయకులు అధికారులకు వినతి పత్రంఅందజేశారు. కాని ఈ స్థలం కేటాయింపు ప్రతిపాదనలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీనివాసనగర్‌లో ఓ విద్యా సంస్థ స్థలంపై కన్నేశారు. ఇది వివాదాస్పదం కావడంతో వెనక్కితగ్గారు. ఇదే సమయంలో జాతీయ రహదారిని అనుకుని ఉన్న రెవెన్యూ స్థలం తీసుకోవాలని సమాలోచనలు చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఈ క్రమంలో మూలసాగరంలో సర్వే నంబరు 504/2లో ఎకరం స్థలం ఖాళీగా ఉన్న విషయాన్ని వైకాపా నాయకులు గుర్తించారు.

ఆమోదం తెలిపిన పురపాలకం

కుందూనది వరదలతో ఏటా నంద్యాల పట్టణం మునిగిపోతోంది. ఆస్తి, పంటలు, ప్రాణనష్టం జరుగుతుండటంతో వరద ముప్పును నివారించేందుకు ఇక్కడ కరకట్ట నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 2007లో ఇక్కడ రైతుల నుంచి భూమిని సేకరించారు. ఆ తర్వాత కరకట్టల నిర్మాణం ప్రతిపాదనలు లేకపోవడంతో భూమి అలాగే ఉండిపోయింది. ఇందులో రెండేళ్ల క్రితం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల న్యాయస్థానంలో ఈ కేసును వేకెట్‌ చేయించారు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే ఇళ్ల స్థలాలకు పోగా మిగిలిన ఎకరా స్థలాన్ని వైకాపా కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించేలా గుట్టుచప్పుడు కాకుండా ప్రతిపాదనలు చేశారు.

అంతా వ్యూహాత్మకం

కౌన్సిల్‌లో అధికార పార్టీ కౌన్సిలర్ల సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో వ్యూహాత్మకంగా వారం రోజుల క్రితం అజెండాలో చేర్చారు. ఉన్నతాధికారులు పార్టీ కార్యాలయానికి నేరుగా భూమి కేటాయిస్తే విమర్శలు వ్యక్తమయ్యే ఆస్కారం ఉండటంతో కౌన్సిల్‌ ఆమోదంతోనే ముందుకెళ్లాలని ఇద్దరు ప్రజాప్రతినిధులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతిపాదించిన స్థలానికి కొంతదూరంలో కొన్ని నెలల కిందట వైకాపా జిల్లా పార్టీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. తాజాగా ఇదే ప్రాంతంలో స్థలం కేటాయించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే కార్యాలయ భవనాన్ని నిర్మించి రాబోయే ఎన్నికల నాటికి జిల్లా వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించేలా నాయకులు అడుగులు వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు