logo

వైకాపా కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రగడ

నంద్యాల పట్టణంలో వైకాపా కార్యాలయ భవనం నిర్మాణం కోసం ఎకరా స్థలాన్ని లీజు ప్రాతిపదికన కేటాయించడంపై సోమవారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌లో వాడివేడి చర్చ జరిగింది.

Published : 30 May 2023 02:56 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : నంద్యాల పట్టణంలో వైకాపా కార్యాలయ భవనం నిర్మాణం కోసం ఎకరా స్థలాన్ని లీజు ప్రాతిపదికన కేటాయించడంపై సోమవారం జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌లో వాడివేడి చర్చ జరిగింది. పట్టణంలోని పురపాలక సమావేశ మందిరంలో ఛైర్‌పర్సన్‌ మాబున్నిసా అధ్యక్షతన సోమవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. అజెండాలోని 12వ అంశంగా మూలసాగరం సర్వే నంబరు 504/2లోని ఎకరం భూమిని వైకాపా కార్యాలయ భవనం కోసం లీజు పద్ధతిలో కేటాయించడం కోసం కౌన్సిల్‌ ఆమోదం కోరారు. దీనిపై తెదేపా, వైకాపా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కుందూనది విస్తరణ కోసం సేకరించిన భూమిని గతంలో నీటి పారుదల శాఖకు అప్పగించారని తెదేపా ఫ్లోర్‌లీడర్‌ మబూవలి కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. కాని ఈ భూమిని ఇరిగేషన్‌ శాఖ వినియోగించుకోకుండా తిరిగి రెవెన్యూ శాఖకు అప్పగించిందన్నారు. దీంతో పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించారని చెప్పారు. ఆ భూమిని ఒక రాజకీయ పార్టీకి ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఛైర్‌పర్సన్‌ మాబున్నిసా జోక్యం చేసుకుంటూ మున్సిపాల్టీ పరిధిలో లీజు పద్ధతిలో స్థలాలను కేటాయించేందుకు కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరని చెప్పారు. వైకాపా కౌన్సిలర్లు స్థలం కేటాయింపు తమకు ఆమోదయోగ్యమేనంటూ బల్లలు చరిచారు. వైస్‌ ఛైర్మన్‌ పాంషావలి ఫ్లోర్‌లీడర్‌ మబూవలి ప్రసంగాన్ని అడ్డుకుంటూ వాగ్వాదానికి దిగారు. మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపడంతో ఛైర్‌పర్సన్‌ పచ్చజెండా ఊపారు. ఇందుకు నిరసనగా తెదేపా కౌన్సిలర్లు నాగార్జున, జైనాబీ, శ్రీదేవి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాబున్నిసా, కమిషనర్‌ రవిచంద్రారెడ్డిలకు డీసెంట్‌ నోట్‌ అందజేశారు. సమావేశంలో చర్చ సందర్భంగా వైకాపా కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. ఒక వాలంటీరు కుటుంబంలో నలుగురికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని