logo

ప్రకృతి సేద్యం.. వేతన కష్టం

పెట్టుబడి లేని సాగు వైపు ప్రోత్సహించేలా క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యవంతులను చేసేందుకు ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని నియమించారు.

Updated : 31 May 2023 06:11 IST

పది నెలలుగా జీతం అందక ఇబ్బందులు
అల్లాడుతున్న సిబ్బంది

నగరంలోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పెట్టుబడి లేని సాగు వైపు ప్రోత్సహించేలా క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యవంతులను చేసేందుకు ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని నియమించారు. ప్రతి నెలా వారికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. పది నెలలుగా బడ్జెట్‌ లేకపోవడంతో జీతాలు జమ కాలేదు.  అధికారులను అడగలేక పస్తులుంటూ.. అప్పులు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులకు సమస్య విన్నవించినా పట్టించుకోకపోవడంతో వారి జీవనం దయనీయంగా మారింది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత పదేళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ సాగు విధానం అమలవుతోంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పలు రకాల పంటలు పండిస్తున్నారు. వర్షాధారం, వ్యవసాయ బోర్ల కింద రైతులు ఏటా రెండు, మూడు రకాల పంటలు సాగు చేస్తున్నారు. సాగు ఖర్చులు తగ్గడంతోపాటు మార్కెట్‌లో ఆశాజనకమైన ధరలు లభిస్తుండటంతో ఏటా సాగుదారులు పెరుగుతున్నారు. వీరికి చేయూతగా ఉంటూ మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. కషాయం, జీవామృతం వంటివి క్షేత్రస్థాయిలో రైతులే స్వచ్ఛందంగానే తయారు చేసుకునేలా అవగాహన కల్పిస్తూ, సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

లక్ష్యం ఇలా..

2022-23 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు జిల్లాలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సాగు చేయించాలని ఉన్నతాధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. 60 వేల మందికిపైగా రైతులతో 70 వేల ఎకరాల్లో పలు రకాల పంటలతోపాటు పండ్ల తోటలు సాగు చేయించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. గతేడాది సాగు చేసినవారితోపాటు అదనంగా మరో పది వేల మంది రైతులను సాగు వైపు మళ్లించాల్సి ఉంది.

కార్యాలయాలకు బడ్జెట్‌ ఉన్నా..

జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం (డీపీఎం) పరిధిలో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బడ్జెట్‌ అందుబాటులో ఉంది. కనీసం కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికైనా ఆ బడ్జెట్‌ సర్దుబాటు చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుసాధికార సంస్థ నుంచి వేతనాలకు బడ్జెట్‌ విడుదల చేసినప్పుడు వస్తాయని.. అంతవరకు నిరీక్షించాల్సిందేనని.. కార్యాలయ బడ్జెట్‌ ఇచ్చేందుకు వీలులేదంటూ చెబుతుండటం గమనార్హం.

అధికారి పెత్తనం

ఓ వ్యవసాయాధికారి (ఏవో).. కర్నూలు జిల్లా డీపీఎంగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. అంతా తాను చెప్పినట్లే జరగాలని సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నారు. ఓ పక్క వేతనాలు రాక.. మరోపక్క అధికారి వేధింపులు భరించలేక ఉద్యోగులు నలిగిపోతున్నారు. గతంలో ఓసారి సదరు అధికారి తీరుపై రైతుసాధికార సంస్థ ఉన్నతాధికారులకు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తనపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఆ అధికారి ఉద్యోగులపై కక్ష కట్టారు. ఇలాగైతే తాము ఎలా పనిచేయాలో అర్థం కావడం లేదని ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

రూ.10.42 కోట్ల వరకు బకాయిలు

ప్రకృతి వ్యవసాయం కింద జిల్లావ్యాప్తంగా (ఐసీఆర్‌పీ, సీఆర్‌పీలు, ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 కేడర్‌) వివిధ హోదాల్లో 301 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, జిల్లా డీపీఎం కార్యాలయంలో డిజిటల్‌ ఎంటీలు, ఎన్‌ఎఫ్‌ఏ, జూనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్లు.. 8 మంది కలిపి మొత్తం 309 మంది పనిచేస్తున్నారు. నంద్యాల జిల్లాలో క్షేత్రస్థాయి సిబ్బంది వివిధ హోదాల్లో 429 మందికిపైగా, కార్యాలయంలో మరో 8 మంది కలిపి 437 మంది ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్షేత్రస్థాయిలో, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది 746 మంది వరకు ఉన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 10 నెలల వేతనాలు రావాలి. నెలకు రూ.కోటి చొప్పున పది నెలలకు రూ.10 కోట్లు, రెండు జిల్లాల్లో కార్యాలయ సిబ్బందికి గతేడాది నవంబరు నుంచి ఇప్పటివరకు 7 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. నెలకు రూ.6 లక్షల చొప్పున ఏడు నెలలకు రూ.42 లక్షలు కలిపి రూ10.42 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని