logo

నిరీక్షించి.. నిరాశ చెంది

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సర్వర్‌ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. సోమవారం ఆన్‌లైన్‌ సర్వర్‌ మొరాయించటంతో సేవలు నిలిచిపోయిన సంగతి విదితమే.

Published : 31 May 2023 03:39 IST

రెండోరోజూ రిజిస్ట్రేషన్‌ సేవలకు అంతరాయం

కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వేచి ఉన్న జనం

కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సర్వర్‌ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. సోమవారం ఆన్‌లైన్‌ సర్వర్‌ మొరాయించటంతో సేవలు నిలిచిపోయిన సంగతి విదితమే. మంగళవారం సైతం అదే పరిస్థితి కొనసాగింది. ఫలితంగా రిజిస్ట్రేషన్లతోపాటు ఈసీ, ఇతరత్రా సేవలు పూర్తిగా ఆగిపోయాయి. జూన్‌ 1 నుంచి భూములు, స్థలాల విలువలు పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు మంగళవారం సైతం జనం భారీగా తరలివచ్చారు. రాత్రి వరకు వేచి చూసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి నిరాశతో వెనుదిరిగారు.

ఉన్నతాధికారులు స్పందించక..

ఆయా ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు మంగళవారం ఉదయమే జనం తరలివచ్చారు. ఎంతకీ సర్వర్‌ పనిచేయకపోవడంతో కార్యాలయాల ఉద్యోగులు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో సర్వర్‌ ఎప్పుడు పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. భూములు, స్థలాల విలువ పెంపు అమలులోకి వస్తున్న నేపథ్యంలో అప్పటివరకు సర్వర్‌ పనిచేయకపోతే అదనపు రుసుము భారం పడుతుందని అవసరార్థులు ఆందోళన చెందారు.

ఆదాయానికి భారీగా గండి

గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయిన నేపథ్యంలో బుధవారం నుంచి మాన్యువల్‌ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు సబ్‌ రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఒకవేళ సర్వర్‌ పనిచేస్తే మాత్రం మాన్యువల్‌ విధానం అవసరం లేదని సూచించారు. రెండు రోజులపాటు రిజిస్ట్రేషన్లు సేవలు నిలిచిపోవటంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమయ్యే దాదాపు రూ.2 కోట్ల రాబడి నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని