logo

అడవి దాటించారు.. హద్దులు మరిచారు

నల్లమల అడవిలో.. వనదేవత ఒడిలో హాయిగా జీవనం సాగించేవారు. పునరావాసం పేరుతో బయటకు తీసుకొచ్చారు. మెరుగైన జీవితం ఉంటుంది.. వసతులు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Published : 31 May 2023 03:39 IST

చెంచులకు పంపిణీ చేసిన భూములు

ఆత్మకూరు, న్యూస్‌టుడే : నల్లమల అడవిలో.. వనదేవత ఒడిలో హాయిగా జీవనం సాగించేవారు. పునరావాసం పేరుతో బయటకు తీసుకొచ్చారు. మెరుగైన జీవితం ఉంటుంది.. వసతులు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పట్టాలిచ్చారు.. 34 ఏళ్లుగా హద్దులు చూపకపోవడంతో వారు దుర్భర జీవితం గడుపుతున్నారు. వరదరాజస్వామి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పెచ్చెర్వు గూడెంలోని 165 చెంచు కుటుంబాలను 1985లో కొట్టాల చెరువుకు తరలించారు. ప్రతి కుటుంబానికి ఐదెకరాలు , రూ.5 వేల నగదు, ఐదు సెంట్ల స్థలం, చదువుకున్న వారికి ప్రాజెక్టులో ఉద్యోగం ఇవ్వడంతో పాటు సాగుకు బావులు తవ్విస్తామని అప్పట్లో అధికారులు హామీలు ఇచ్చారు. కురుకుంద గ్రామ సమీపంలో రెండున్నర ఎకరాల చొప్పున, ఇతరులకు ఎకరం చొప్పున భూములు కేటాయించారు. పునరావాస జాబితాలో పేరున్నా కొందరికి నేటికీ పొలాలు, ఇంటి స్థలాలు కేటాయించలేదు. ఇప్పటికే 89 మంది వరకు మృతిచెందారు.

అర్హులకు దక్కని చోటు

139 కుటుంబాలకు 346.91 ఎకరాలు కేటాయించారు. స్థానిక నేతల జోక్యంతో చేసుకుని కొట్టాల చెరువులో ఉంటున్న చెంచు కుటుంబాలనూ పునరావస జాబితాలో చేర్చించారు. పెచ్చెర్వు నుంచి వచ్చిన చెంచు కుటుంబాల్లో కొందరికి ఇళ్ల స్థలాలు చూపలేదు.. చేసేది లేక 32 కుటుంబాల వారు తిరిగి పెచ్చెర్వు గూడేనికి వెళ్లిపోయాయి. ఇతరులు చేరడం, పేర్ల మార్పులతో జాబితాను పక్కన పెట్టేశారు. ఎవరికి ఎక్కడ భూమి కేటాయించారో హద్దులు చూపకపోవడంతో 34 ఏళ్లుగా చెంచులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు చెంచుల భూములకు కొందరు ఆక్రమించుకున్నారు. వీరికి కేటాయించిన భూముల్లో వరదరాజ స్వామి ప్రాజెక్టు నుంచి పంట కాల్వలు తవ్వారు. పాసు పుస్తకాలు లేకపోవడంతో నష్ట పరిహారం అందలేదు. ప్రాజెక్టు నుంచి పక్క మండలాల చెరువులకు నీరు తరలిస్తున్నా స్థానికంగా తమకు సాగునీరు అందట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


జీవనోపాధి కరవైంది

పునరావాసం కింద వచ్చిన కొట్టాల చెరువుకు వచ్చిన చెంచులకు జీవనోపాధి కరవైంది. చేపలు పట్టి జీవనం సాగించాలన్న ఆశతో వరదరాజ స్వామి ప్రాజెక్టులో చేప పిల్లలు వదులుకున్నాం. వివిధ ప్రాంతాల్లో పట్టుపడిన మొసళ్లను తెచ్చి ఈ ప్రాజెక్టులో వదిలారు. మొసళ్లకు హాని కలుగుతుందని చేపలు పట్టేందుకు అనుమతి ఇవ్వడంలేదు. అటవీ ఉత్పత్తులు తెచ్చుకోవడానికి వెళ్తే అడ్డుకుంటున్నారు.

దాసరి బంటి వీరన్న


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని