logo

అందని సాయం.. బతుకు భారం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక.. అప్పులు తీవ్రమై ప్రాణాలు తీసుకుంటున్నారు.

Updated : 01 Jun 2023 04:35 IST

బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులు
బాధిత కుటుంబాలకు కానరాని ఓదార్పు

కర్నూలు సచివాలయం, ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక.. అప్పులు తీవ్రమై ప్రాణాలు తీసుకుంటున్నారు. రైతు ఆత్మహత్య చేసుకున్న 24 గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత కొన్నాళ్లకు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయి అధికారుల కమిటీ రైతు కుటుంబాన్ని సమగ్రంగా విచారించి అర్హత మేరకు రూ.7 లక్షల సాయం అందించాలని నిర్ణయించింది. తక్షణమే సాయమందించేందుకు ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.కోటి మానిటరింగ్‌ ఫండ్‌ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పింది. అవన్నీ నీటి మూటలుగా మారాయి. త్రిసభ్య కమిటీ విచారణ పేరుతో కాలం కరిగిపోతోంది. రోజులు.. వారాలు.. నెలలు గడుస్తున్నా సాయం అందడం లేదు.

ఏడాది దాటినా..

కర్నూలు జిల్లా నందవరం మండల కేంద్రంలో నరసయ్య అనే రైతు గతేడాది మార్చి 6న చనిపోయారు. గ్రామ వీఆర్వో లాగిన్‌ నుంచి మండలస్థాయి.. అక్కడి నుంచి  డివిజన్‌ స్థాయి కమిటీకి వివరాలు పంపారు. డివిజన్‌ స్థాయిలో ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయ శాఖ సబ్‌ డివిజన్‌ ఏడీఏతో కూడిన త్రిసభ్య కమిటీ నివేదికను జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో)కి ఇప్పటివరకు పంపలేదు. విచారణ చేసేందుకే ఏడాదికిపైగా సమయం పట్టింది. దీనిని చూస్తే రైతు కుటుంబాలపై అటు ప్రభుత్వం.. ఇటు వ్యవసాయశాఖ అధికారులు చూపుతున్న శ్రద్ధ ఏమాత్రం ఉందో అర్థమవుతోంది.

* 2022లో చనిపోయిన రైతులకు సంబంధించి పలు కుటుంబాలకు సాయం అందలేదు. 21 రైతు కుటుంబాలు సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉన్నాయి.

విచారణ పేరుతో కాలయాపన

* కర్నూలు జిల్లా వ్యాప్తంగా గతేడాది నుంచి ఇప్పటివరకు 62 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 30 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. మరో 18 దస్త్రాలు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో పెండింగ్‌లో ఉన్నాయి.. జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) దగ్గర రెండు, తహసీల్దారు వద్ద ఒకటి, ఆర్డీవోల వద్ద మూడు దరఖాస్తులు త్రిసభ్య విచారణ పేరుతో పెండింగ్‌లో ఉండిపోయాయి. మరో 8 దస్త్రాలను తిరస్కరించారు.

* నంద్యాల జిల్లాలో 46 మంది ఆత్మహత్యలు చేసుకోగా అందులో 39 రైతు కుటుంబాలకు రూ.7 లక్షల సాయం అందించామని.. ఇక ఏడు కుటుంబాలకు మాత్రమే సాయం రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. త్రిసభ్య కమిటీ విచారణలో, కమిషనరేట్‌లో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటున్నారు.

అనర్హులకు అందించేలా..

కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల కారణంగా ప్రభుత్వ సాయం అనర్హుల చేతుల్లోకి వెళ్తోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.7 లక్షల సాయం కోసం కొందరు త్రిసభ్య కమిటీలను సైతం బురిడీ కొట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అనర్హులైన వారికి సాయం అందించేందుకు పావులు కదుపుతున్నారన్న విమర్శలున్నాయి.

తుగ్గలి మండలం మారెళ్లలో బచ్చు నరసింహులు అనే రైతు గతేడాది జనవరి 1న ఆత్మహత్య చేసుకున్నారు. 16 నెలలు దాటినా ఇప్పటికీ ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందలేదు. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయి త్రిసభ్య కమిటీలు విచారణ నివేదికలను జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో)కి పంపారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. సాయం ఒక్క రోజులో అన్నారు.. ఏడాది దాటినా ప్రభుత్వ సాయం అందక రైతు కుటుంబం దీనావస్థలో ఉంది.

సి.బెళగల్‌ మండల కేంద్రంలో వెంకటేశ్‌ అనే రైతు 2021, అక్టోబరు 29న బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వ సాయం అందలేదు. బాధిత కుటుంబం గ్రామ, మండల, డివిజన్‌ స్థాయి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉంది. దస్త్రం తమ వద్ద పెండింగ్‌లో లేదని... కమిషనరేట్‌ దగ్గర ఉందని అధికారులు చెబుతూ వస్తున్నారు.

పనులకు వెళుతూ..

ఈ చిత్రంలోని వారు వడ్డె నడిపి ఈరన్న భార్య వరలక్ష్మి, ఆయన పిల్లలు. ఆదోని మండలం జి.హాసళ్లి గ్రామానికి చెందిన ఈరన్న అనే కౌలు రైతు అప్పుల బాధతో 2023 జనవరి 14న ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పొలం కౌలుకు తీసుకుని సాగు చేసి నష్టపోయారు. రూ.4.50 లక్షల వరకు అప్పులు చేశారు. ఎలా తీర్చాలో దిక్కుతోచక ఉరేసుకున్నారు. అతనికి భార్య వరలక్ష్మి, పిల్లలు మహాదేవి, గణేశ్‌, నరసింహా ఉన్నారు. వరలక్ష్మి కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తెకు పెళ్లి చేశారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆమె విన్నవించారు.

ఎదురుచూపులే మిగిలాయి

ఈ చిత్రంలోని మహిళ పేరు పద్దమ్మ. ఆదోని మండలం జి.హాసళ్లి గ్రామానికి చెందిన ఆమె కుమారుడు బల్లురు నరసింహా 2022 ఆగస్టు 22న ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతను సాగు కోసం రూ.3.50 లక్షల వరకు అప్పు చేశారు. పంటలు పండక.. అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. అతనికి భార్య లింగమ్మ, పిల్లలు అనితమ్మ, ఉమా, త్రివేణి, పురుషోత్తం ఉన్నారు. ఆ కుటుంబం కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. నెల కిందట పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు. అప్పులు చేసి వివాహం చేశామని నరసింహా తల్లి పద్దమ్మ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని