రిజిస్ట్రేషన్లకు వరుస కట్టారు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బుధవారం కిటకిటలాడాయి. గత రెండు రోజులుగా సర్వర్ పనిచేయక రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో మాన్యువల్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.
కిటకిటలాడిన కార్యాలయాలు
కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రద్దీ
కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బుధవారం కిటకిటలాడాయి. గత రెండు రోజులుగా సర్వర్ పనిచేయక రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో మాన్యువల్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. పైగా జూన్ ఒకటో తేదీ నుంచి భూములు, స్థలాల మార్కెట్ విలువలు పెరుగుతున్న సంగతి విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలో క్రయవిక్రయదారులు బుధవారం పెద్ద సంఖ్యలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తరలివచ్చారు. ఫలితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సబ్ రిజిస్ట్రార్లతోపాటు కార్యాలయాల ఉద్యోగులు అవిశ్రాంతంగా పనిచేయాల్సి వచ్చింది.
రూ.2 కోట్లకుపైగా ఆదాయం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారులు రెండు పద్ధతులు (మాన్యువల్, ఆన్‌లైన్) అనుసరించి రిజిస్ట్రేషన్లు చేశారు. బుధవారం సాయంత్రానికే కర్నూలులో 230, కల్లూరులో 180కిపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఉమ్మడి జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1,500కుపైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. రూ.2 కోట్లకుపైగా ఆదాయం వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎట్టకేలకు ప్రక్రియ జరగటంతో క్రయవిక్రయదారులకు ఎంతో ఊరట కలిగింది. ఆయా ప్రాంతాల్లోని కార్యాలయాలకు జనం భారీగా తరలిరావడంతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరికి గురై ఇబ్బందులు పడ్డారు.
నేటి నుంచి పెరగనున్న విలువలు
జిల్లాలో భూములు, స్థలాల మార్కెట్ విలువల పెంపు గురువారం నుంచి అమలులోకి రానుంది. దీనికి సంబంధించి జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు వివరాలు సిద్ధం చేశారు. కర్నూలు జిల్లాలోని 11 కార్యాలయాల పరిధిలో 452 ప్రాంతాలు ఉండగా 100 ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెరగనున్నాయి. ప్రదేశాలను బట్టి 10 శాతం నుంచి 40 శాతం వరకు విలువ పెంచుతున్నారు. ఎక్కడెక్కడ ఎంత పెంచుతారన్నది గురువారం నాటికి స్పష్టత రానుంది. దీనికి సంబంధించిన జీవో బుధవారం రాత్రి విడుదలైంది.
* భూములు, స్థలాల మార్కెట్ విలువలు పెంచొద్దంటూ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు బ్యానర్ కట్టి నిరసన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.